సహజ వనరుల పునరుద్ధరణ కోసమే హైడ్రా

– మంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సహజ వనరులను రక్షించుకోకపోతే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హెచ్చరించారు. నదులు, చెరువులు, వాగులు, అడవులు ప్రతిదీ మానవాళి మనుగడుకు అవసరమైనదే అని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో పర్యావరణ సంస్‌ నిర్వహించిన ‘గృహ’ సదస్సులో ఆయన ప్రసంగించారు. మనం సాధించిన అభివృద్ధితో పాటు జీవావరణానికి అపార నష్టం జరుగుతోందని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయని శ్రీధర్‌ బాబు తెలిపారు. వేగంగా జరుగుతున్న పర్యావరణ మార్పులను నియంత్రించేందుకు వ్యక్తిగత స్థాయిలో, ప్రభుత్వ పరంగా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన సూచించారు. చెరువులు, వర్షపు నీటి నాలాలు, నదులను కాపాడేందుకే తమ ప్రభుత్వం ‘హైడ్రా’ విభాగాన్ని ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోందని వెల్లడించారు.
నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురికావడం వల్ల వరద నీటి ముంపు సమస్య తలెత్తుతోందని ఆయన తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి పరిస్థితి చేయిదాటి పోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్‌ సిటీ అత్యాధునిక టెక్నాలజీలతో కార్బన్‌ రహిత (జీరో కార్బన్‌) నగరంగా రూపొందుతుందని వెల్లడించారు. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించాల్సిందిగా మహేంద్రా యూనివర్సిటీని కోరామని గృహ సంస్థ కూడా చేతులు కలిపి పర్యావరణహిత నగరానికి దోహదపడాలని శ్రీధర్‌ బాబు కోరారు. ఇదంతా కొత్త ఉద్యోగాల సృష్టికి, స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. నవోదయ విద్యాసమితి సంస్థలు రూపొందించిన సస్టెయినబుల్‌ ఇనీషియేటివ్స్‌ అనే సంకలనాన్ని మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. బెంగళూరు మెట్రో రైల్‌ ప్రాజెక్ట్స డైరెక్టర్‌ రాధాకృష్ణ రెడ్డి మాట్లాడుతూ తమ అవసరాలకు తగిన స్థాయిలో పునరుత్పాదన ఇందనాన్ని సోలార్‌ ఎనర్జీ రూపంలో తయారు చేసుకుంటున్నామని తెలిపారు. గృహ సంస్థ ప్రతినిధులు సంజరు సేథ్‌, షబనా బస్సీ తదితరులు ప్రసంగించారు.