హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి

– ఉచిత చేపపిల్లల సరఫరాలో టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలి:
– తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని సంఘం ఉపాధ్యక్షులు శీలం శీను అధ్యక్షతన నిర్వహించారు. టెండర్ల ప్రక్రియను రద్దు చేసి మత్స్య సొసైటీ అకౌంట్లలో నగదు జమ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 20 ఏండ్ల కాలంలో సుమారు మూడువేల చెరువులు, కుంటలను రాజకీయ బ్రోకర్లు, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కబ్జాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో చేస్తున్న చర్యలను తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం అభినందిస్తుందని తెలిపారు. ఆగస్ట్‌ పూర్తవుతున్న నేపథ్యంలో మూడంగళాల నాణ్యమైన చేప పిల్లలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి మత్స్య సొసైటీ అకౌంట్లలో నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. చేప విత్తనాల చెరువును డ్రాగ్‌ చేయటం, టైమ్‌ స్కేల్‌ యాప్‌ ద్వారా వీడియోగ్రఫీ చేసి ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టుతో పాటు సబ్‌మిట్‌ చేస్తూ నిజమైన బిడ్డర్‌ను ఎంపిక చేయటం ద్వారా చేపపిల్లలు సరఫరా చేయడంలో అవకతవకలు నిర్మూలించ వచ్చని పేర్కొన్నారు. పదేండ్ల కాలంలో చేప, రొయ్య పిల్లల పంపిణీలో జరిగిన అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.