‘హైడ్రా’ చర్యలు : సామాన్యులే సమిధలా?

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, పార్కులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి విడిపించి, అక్రమ నిర్మాణాలను తొలగించి, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్‌ హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ (హైడ్రా)ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతించాల్సిందే.ఒకప్పుడు హైదరాబాద్‌ చెరువుల నగరంగా ఉండేదని, గతంలో పాలించిన ప్రభుత్వ పెద్దల, రాజకీయ నాయకుల అండదండలతో అవన్నీ కబ్జాలకు గురై, హైదరాబాద్‌ వరదల నగరంగా తయారైందన్నది వాస్తవం. అందుకోసం హైడ్రా ఏర్పాటు కావడం మంచిదే. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలరాదు,ఎంత పెద్ద కట్టడమైనా నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయాల్సిందే. అయితే ఇది పెద్దల నుంచి పేదల దాకా ఒకే దూకుడు ప్రదర్శిస్తూ, పేదలకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఇండ్లు కూల్చేయడం దారుణం. కూల్చివేతల పర్వం సంపన్నుల నుండి సామాన్యుల వరకు ఒకే విధంగా ఉండరాదు. గ్రామాల్లో పనుల్లేక పొట్టచేత పట్టుకొని హైదరాబాద్‌ వచ్చి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని బతుకుతున్నారు. మురికి కాలువల వెంట, నాలాలపై చిన్న చిన్న నిర్మాణాలు చేసుకున్న వారి పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాలి. వీరికి ప్రత్యా మ్నాయం చూపకుండా ఇలాంటి చర్యలు తీసుకురావడం సర్కార్‌కు చెడ్డపేరు తెస్తుందనే అంశం గమనించాలి.
ఏ ప్రభుత్వమైనా ప్రక్షాళన పేరుతో ఏ కార్యక్రమం చేపట్టినా మొదట సమిధలవుతున్నది పేదలే. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు హైడ్రా ముందుకు సాగడం మంచిదే. కానీ అది పేదల ఇండ్ల కూల్చివేతల నుంచి మొదలు పెట్టడమే సరైంది కాదు. ఎందుకంటే వారి నిర్మాణాలు, 20, 30 గజాలు మహా అయితే వంద గజాల స్థలంలో మాత్రమే ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు, కార్పొరేట్లు, సినీతారలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ సంస్థల అధిపతులు వంటివారు అక్రమిం చుకున్న ఎకరాలు పక్కకు పెట్టి పేదల ఆస్తుల పైకి రావడమనేది చాలా దుర్మార్గమైన చర్య. అధికారులను నయానో, భయానో తమ గుప్పిట్లోకి తెచ్చుకొని, ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని ఎఫ్‌టిఎల్‌, బఫర్‌ జోన్‌లను ఆసాంతం ధ్వంసం చేసిన వారికేమో నోటీసులిచ్చి, కొంత సమయమిచ్చి, వారికి ఎలాంటి ఆర్థిక, సామాజిక ఇబ్బందులు కలగకుండా ఒకటో రెండో కూల్చి ఇదిగో ఎవ్వరివైనా కూల్చేస్తాం అంటూ ప్రజలను ఏమార్చే పనిచేస్తున్నది హైడ్రా. ఇది ఎవరూ గమనించడం లేదు, తాము ఏం చేసినా చెల్లుతుందనే అపోహలో హైడ్రా, ప్రభుత్వం భావించినట్లు ఉందనిపిస్తోంది. అందుకే పేదల ఇండ్లపైకి అర్ధరాత్రి పోలీసు బలగాలతో, ప్రొక్లెయిన్లతో వెళ్లి ఉన్నఫళంగా నేలమట్టం చేస్తున్నది. ఇప్పటివరకు హైడ్రా కూల్చిన వాటిలో ఎన్ని పెద్దల భవంతులు ఎన్ని కూల్చారు? పేదల ఇండ్లు ఎన్ని కూల్చారో చూస్తుంటేనే పరిస్థితి అర్థమవుతుంది. వ్యాపారులు, కార్పోరేట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భూములను అప్పనంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగకుండా ఉండాలి.
మూసీ సుందరీకరణ పేరుతో..!
నార్సింగి నుంచి నాగోల్‌ వరకు దాదాపు 25 కి.మీ పొడవునా మూసీకి ఇరువైపులా పన్నెండు వేలకు పైగా తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలున్నట్లు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌ఎఫ్‌సిఎల్‌) సర్వే తెలిపింది. ఆ సర్వే ప్రకారం వాటన్నింటినీ తొలగిస్తామంటున్నది. కానీ ఇప్పటికే అన్ని డిపార్ట్‌మెంట్ల భవన నిర్మాణాలకు అనుమతులు ఇంటి నిర్మాణాలు జరిగాయి. పేదలు నిర్మించుకున్న ఇండ్లకు కరెంట్‌, నీళ్లు, డోర్‌ నెంబర్లు, రోడ్లు, డ్రెయినేజీ లాంటి వసతులు కల్పించి, వారి నుంచి ఇంటి పన్నులు కూడా వసూలు చేశారు. ఇంత చేసి ఇప్పుడేమో ఉన్నఫళంగా ఇప్పటికిప్పుడు అక్రమ నిర్మాణాలు కాబట్టి కూలుస్తామంటే ప్రజలు తిరగబడరా? గ్రామాల్లో పనులు దొరక్క హైదరాబాద్‌కు వలసచ్చి చిన్న చిన్న ఇంటి నిర్మాణాలు చేసుకొని లక్షలాదిమంది బతుకుతున్నారు. ఇప్పటికే జీవో నెంబర్‌ 58 కింద లక్షలాది పేదలు ఇంటి స్థలాలకు దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ ప్రభుత్వమే ఇండ్లు నిర్మించివ్వాలి.
ప్రభుత్వ భూముల్లో పేదలు జీవిస్తే వారికి ఆ స్థలాలపై హక్కులు కల్పించి, ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసి, ఇండ్ల నిర్మాణానికి వెంటనే పూనుకోవాలి. హైడ్రా చర్యల సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా భూ మాఫియా, రియల్‌ ఎస్టేట్‌ ఇండ్లు, ఇంటి స్థలాలు లేని పేదలకు 125 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. ఈ ఏడాదిలో 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబో తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌, రాజీవ్‌ స్వగృహ, గృహకల్ప ఇండ్లను పేదలకివ్వాలి. ఇండ్లు, ఇంటి స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ||5లక్షలు ఇవ్వాలి. చెరువులు, కుంటలు బాగు చేసేందుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించి, ఖర్చు చేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కబ్జాలు, ఆక్రమణలపై భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలపై హైడ్రాకు ఒక ప్రణాళిక ఉండాలి. ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేసి హైడ్రా కూల్చివేతలకు పూనుకుంటే సరేగాని, లేదంటే ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ప్రభుత్వం ఎదుర్కొవాల్సి ఉంటుంది.