15న హ్యుందారు ఐపీఓ

Hyundai IPO on 15– ధరల శ్రేణీ రూ.1865-1960
న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందారు మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) అక్టోబర్‌ 15న ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రానుంది. ఒక్కో షేర్‌ ధరల శ్రేణీని రూ.1865-1960గా నిర్ణయించింది. దీంతో గరిష్టంగా రూ.27,870 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇష్యూ 17న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే అంటే 14న సబ్‌స్క్రిప్షన్‌ తెరువనుంది. ఈ ఇష్యూలో 14,21,94,700 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం ఒక్క లాట్‌లో రూ.13,720 పెట్టుబడితో 13 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 14 లాట్లు కొనుగోలు చేయడానికి వీలుంది. దేశంలో ఇప్పటి వరకు అతిపెద్ద ఐపీఓగా ఉన్న ఎల్‌ఐసీ కంటే హ్యుందారు ఇష్యూ పెద్దది.