నాకూ ఆత్మా‌భిమానం వుంది

I also have self-esteemపెండ్లి ఎంత గొప్పగా చేసుకుంటారో, సంసార జీవితం కూడా అంతే గొప్పగా ఉండాలనే ఆశతో కొత్త జీవితం మొదలుపెడతారు వధూవరులు. సంతోషంగా ఉండాలని ఈ ఇద్దరే అనుకుంటే సరిపోదు. ఆ కుటుంబ సభ్యులు కూడా భావించాలి. కానీ అలా అందరూ అనుకుంటున్నారా? లేదా అనేదే పెద్ద ప్రశ్న. అందరూ అలా అనుకుంటే పెండ్లి బంధం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది. చాలా మంది విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. భార్యా భర్తలు సర్దుకుపోవడం, పెద్దల అతి జోక్యం లేకుంటే ఆ ఇద్దరి బంధం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. అలా లేనప్పుడు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదువుదాం…
రిజ్వానాకు 24 ఏండ్లు ఉంటాయి. 2021లో హుసెన్‌తో పెండ్లి జరిగింది. కొన్ని రోజులు అంటే ఆరు నెలలు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుండి సమస్యలు మొదలయ్యాయి. అంతకు ముందు అత్తమామలతోనే ఆమెకు సమస్య ఉండేది. తర్వాత భర్త నుండి కూడా ప్రారంభమయ్యాయి. ‘నీకు ఏం చేయడం రాదు, ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా?’ అంటుంటారు. ఇంట్లో కొద్ది సేపు కూడా ఖాళీగా కూర్చోనియ్యరు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆడపడుచు వచ్చినపుడు కూడా ఆమెతో మాట్లాడనివ్వరు. వాళ్ళ పిల్లలకు మాత్రం అన్ని పనులు చేసి పెట్టాలి. వాళ్ళు తనకు సాయం చేస్తామన్నా తల్లి ఒప్పుకునేది కాదు.
‘ఆమెను ఎందుకు పెండ్లి చేసుకొని తెచ్చుకుంది’ అని తిట్టేది. అత్త వేరే ఆవిడనా అంటే అది కూడా కాదు. సొంత మేనత్త అయినా కోడలిని ఎప్పుడూ పరాయి అమ్మాయిలాగానే చూసేది. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళ రూం ఇవ్వమని చెప్పేది. వాళ్ళు ‘ఎందుకు వేరే రూం వుంది కదా, అక్కడ వుంటాము’ అన్నా వినేది కాదు. రాత్రి పని మొత్తం అయిపోయినా తర్వాత కూడా రిజ్వానాను రూంకి వెళ్ళనిచ్చేది కాదు. ఇంకా ఏదో ఒక పని చెప్తూనే ఉండేది. ఆమె వంట చేసినా అత్తకు నచ్చేది కాదు. తిండి కూడా సరిగ్గా తిననివ్వదు. ‘ఎంత తింటావు, మీ అమ్మ ఇంటి నుండి ఏమైనా తెచ్చావా’ అంటూ సూటి పోటి మాటలు అంటూ తిట్టేది.
అత్త ప్రవర్తనతో విసిగిపోయి భర్తకు చెప్పినా అతను పట్టించుకునేవాడు కాదు. పైగా ‘మా అమ్మ ఎందుకు అంటుంది, నువ్వే కావాలని చెప్తున్నావు’ అంటూ ఆమెనే తిట్టేవాడు. అత్తమామలు అనే మాటలు భరించలేక వాటి గురించే ఆలోచిస్తూ దిగులుపడుతూ ఆరోగ్యం పాడుచేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్ళి ఎన్ని మందులు వాడినా పని చేయలేదు. దాంతో అత్త ‘రోగిష్టి దాన్ని ఇచ్చి పెండ్లి చేశారు’ అనడం మొదలుపెట్టింది. అయినా భర్త ఏమీ మాట్లాడడు. పైగా ఆమెకు ఆరోగ్యం బాగోలేదని వాళ్ళ అమ్మ వాళ్ళకు ఫోన్‌ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది. దాంతో ఆమెను తీసుకొచ్చి మళ్ళీ అత్తగారింట్లో వదిలిపెట్టి వెళ్లారు.
ఇలా మూడు నాలుగు సార్లు జరిగింది. చిన్న అనారోగ్యం, జలుబు చేసినా వాళ్ళ ఇంటికి పంపించేవారు. ‘నేను వెళ్లనూ’ అన్నా వినేవారు కాదు. బలవంతంగా పంపించే వారు. పుట్టింటికి వెళితే కనీసం భర్త కూడా వెళ్ళి చూసేవాడు కాదు. ‘నీకెందుకు మాటిమాటికి ఏదో ఒక రోగం వస్తుంది. నిన్ను పెండ్లి చేసుకున్న నాటి నుండి నాకు ఎలాంటి సుఖం లేదు’ అంటూ తిట్టేవాడు. కనీసం వాళ్ళ రూంలో ఉన్నప్పుడు కూడా ఆమెతో ప్రేమగా ఉండడు. ఇలా ఆ ఇంట్లో ఆమెకు మనశ్శాంతి కరువైపోయింది. కనీసం టీవీ కూడా చూడనివ్వరు. వాళ్ళ అమ్మ వాళ్లతో ఫోన్‌ కూడా మాట్లాడనివ్వరు. ఈ మధ్యలో బంధువుల పెండ్లి అంటూ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. పెండ్లి తర్వాత రెండు రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యం వచ్చింది.
హాస్పిటల్‌కి వెళితే డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి ఆమెకు టీబీ ఉందని చెప్పారు. కొన్ని రోజులు రెగ్యులర్‌గా మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. అదే విషయం అత్త వాళ్ళకు చెబితే ‘సరే తగ్గే వరకు మీ దగ్గరే వుంచుకోండి. ఆ తర్వాత పంపించండి’ అన్నారు. ఆరు నెలలు అయినా భర్త, అత్త, మామ ఎవరూ చూడటానికి రాలేదు. అప్పుడప్పుడు వాళ్ళ ఆడపడుచు ఫోన్‌ చేసి మాట్లాడేది. టీబీ పూర్తిగా తగ్గిపోయింది అని డాక్టర్లు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఆమెను తీసుకొని అత్తింటికి వెళ్ళారు. కానీ ఇంట్లోకి రానివ్వలేదు. ‘నీవు వస్తే మా అందరికీ నీ రోగం అంటుకుంటది’ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక వారి కమ్యూనిటీలో ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా ఏమీ చేయలేకపోయారు. చివరకు తెలిసిన వారు చెబితే ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చారు.
రిజ్వానా అత్తింటి వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించాము. ఇలా నాలుగైదు సార్లు చేశాము. కానీ వాళ్లలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా గతం కంటే ఆమెపై వాళ్ళకు కోపం మరింత పెరిగింది. మరింతగా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. భర్తను దగ్గరకు రానిచ్చేవారు కాదు. ‘మీ ఇంట్లో నీకే కాదు మీ అమ్మకు కూడా ఈ రోగం వుంది. మీ కుటుంబంలో చాలా మందికి టీబీ ఉంది. రేపు నీకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ రోగం వస్తుంది’ అనేవారు.
రిజ్వానాకు పూర్తిగా నయం అయ్యిందని ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. ఎలాంటి భయం లేకుండా పిల్లల్ని కనొచ్చు అన్నా వాళ్ళ ధోరణిలో మార్పు లేదు. భర్త కూడా అర్థం చేసుకోవడం లేదు. ‘ఆమెకు రోగం వుంది, అది నాకూ వస్తుంది, ఆమె నాకు వద్దు’ అని కచ్చితంగా చెప్పేశాడు. అతని మాటలను రిజ్వానా ‘మరి నీకు కూడా ‘బొల్లి’ (తెల్లమచ్చల) జబ్బు ఉంది. నేను దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడంటే కొద్దిగా ఉంది. తర్వాత ఒళ్లంతా పాకుతుంది. నీ లోపం గురించి నేను ఎప్పుడూ ఎత్తి చూపించలేదు. టీబీ తగ్గిపోయే జబ్బు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానని డాక్టర్లే చెబుతున్నారు. అయినా దీన్ని నువ్వు ఇంత పెద్దది చేసి చూపిస్తున్నావు’ అంది.
రిజ్వానా చెప్పినా, మేము ఎంతగా సర్ధి చెప్పినా వాళ్లు మాత్రం వినడం లేదు. దాంతో ఆమె కూడా అతనితో కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. ‘నాకు మాత్రం ఆత్మాభిమానం లేదా మేడమ్‌, ఇంతగా చెబుతున్నా ఆయన మాట వినడం లేదు. సమస్యను అర్థం చేసుకోలేని ఇలాంటి వ్యక్తితో నేను జీవితాంతం ఎలా కలిసుండాలి. ఇక నేను కూడా అతనితో బతకలేను’ అంది. దాంతో మేము ఇద్దరికీ మూడు నెలలు సమయం ఇచ్చాము. ఇద్దరినీ బాగా ఆలోచించుకొని రమ్మని చెప్పి పంపించాము. కానీ మూడు నెలల తర్వాత కూడా వాళ్లలో ఎలాంటి మార్పూ రాలేదు. హుసెన్‌, రిజ్వానాకు నాలుగు లక్షల రూపాయాలతో పాటు పెండ్లికి ఇచ్చిన సామాన్లు మొత్తం ఇచ్చి విడిపోయాలని నిర్ణయించుకున్నారు.
– వై.వరలక్ష్మి, 9948794051