– టౌన్‌ప్లానింగ్ అధికారులతో భవన యజమాని వాగ్వివాదం
నవతెలంగాణ-బేగంపేట్
బేగంపేట్ సర్కిల్లో అనుమతులకు మించి అక్రమంగా భవన నిర్మాణాలు నిర్మిస్తే కూల్చివేస్తామని బేగంపేట్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిష్టఫర్ తెలిపారు. బేగం పేట్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీలో రెండు అంతస్తులకు అనుమతి తీసుకోని మరో మూడు అంతస్తులు ఎక్కువగా నిర్మించిన ఓ వ్యక్తి భవనాన్ని రెండు నెలల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేశారు. అనంతరం ఇదే భవనాన్ని సదరు వ్యక్తి తిరిగి నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న టౌన్‌ప్లానింగ్ ఏసీపీ క్రిష్టఫర్ సిబ్బందితో కలిసి బుధవారం మరోమారు కూల్చి వేయడానికి నోటీసులు జారీ చేసేందుకు అక్కడకు వెళ్లారు. అక్కడ భవన యజమాని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ”నేను ప్రభుత్వ అధికారిని (సీఎల్‌పీఏ రెవెన్యూ విభాగం) భవనాన్ని కూల్చివేసి నాకే నోటీసులు జారీ చేస్తారా” అంటూ నానా హంగామా చేశాడు. అయితే భవనాన్ని తిరిగి నిర్మిస్తే ఎట్టి పరిస్థితిలో కూల్చివేస్తామని ఏసీపీ హెచ్చరించారు. అలాగే రాంగోపాల్‌పేట్ డివిజన్లోని కళాసీగూడ గ్రాండ్ మినర్వా వెనకభాగంగా దినేష్ అనే బిల్డర్ తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా మరిన్ని అంతస్తులు, సెల్లార్ తదితర విభాగాల్లో భవనాన్ని అక్రమంగా నిర్మించాడు. ఫిర్యాదు స్వీకరించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ భవనాన్ని కూడా కూల్చి వేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం తిరిగి నిర్మిస్తే చర్యలు తప్పవని సదర్ బిల్డర్ దినేష్‌ను అధికారులు హెచ్చరించారు.
అక్రమ భవనాలను కూల్చివేస్తాం
బేగంపేట్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీలో అక్రమం గా భవనాలు నిర్మిస్తే ఖచ్చితంగా కూల్చివేస్తాం. ఇప్పటికే రెండు భవనాలను కూల్చివేశాం. మరో రెండు భవనాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. వాటికి కూడా నోటీసులు జారీ చేసి కూల్చి వేస్తా0. పలు అక్రమ భవనాల నిర్మాణాల వెనక స్థానిక ప్రజా ప్రతినిధులే ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వాటిని కూడా కూల్చివేస్తాం
టౌన్ ప్లానింగ్ బేగంపేట్ సర్కిల్ ఏసీపీ క్రిష్టఫర్