గత ముఖ్యమంత్రుల బాటలోనే నేనూ!

I am in the footsteps of the past chief ministers!– చంద్రబాబు, వైఎస్‌, కేసీఆర్‌ల హయాంలో ప్రగతి పథంలో హైదరాబాద్‌
– వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం
– రూ.2 వేల కోట్లతో 64 ఐటీఐల అభివృద్ధి
– స్కిల్లింగ్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు సంప్రదింపులు
– ఓఆర్‌ఆర్‌ హైదరాబాద్‌కు లైఫ్‌లైన్‌ : సీఐఐ సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత ముఖ్యమంత్రుల బాటలోనే తాను హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడుతానని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లోని హౌటల్‌ వెస్టిన్‌లో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ (సీఐఐ) తెలంగాణ ఆధ్వర్యంలో విద్య, నైపుణ్యావృది,్ధ వ్యవస్థాపక అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్‌, చంద్రబాబు, కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌ ప్రగతి పథంలో దూసుకు పోయిందని అన్నారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవనీ. గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని అన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని రేవంత్‌ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన అనుమతుల నుంచి మొదలుకుని రక్షణ వరకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ తీసుకున్న విధానపరమైరన నిర్ణయం వల్ల గతంలో హైదరాబాద్‌లో ఐడీపీఎల్‌ ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పుడేసిన అడుగులే నేడు నగరాన్ని ఫార్మా హబ్‌గా మార్చేందుకు దోహద పడ్డాయని చెప్పారు. గతంలో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ గురించి మాట్లాడితే అవసరం లేదని అన్నారనీ, ఇప్పుడది హైదరాబాద్‌కు లైఫ్‌ లైన్‌గా మారిందని సీఎం తెలిపారు. రూ.2 వేల కోట్లతో తెలంగాణలో ఉన్న 64 ఐటీఐలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.
విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామని పేర్కొన్నారు. స్కిల్లింగ్‌ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో జాయిన్‌ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్లు అందించనున్నట్టు వెల్లడించారు. లాజిస్టిక్‌ రంగంలో మరింత అవకాశాలు మెరుగుపర్చేందుకు డ్రైపోర్ట్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.