నాకు మిస్డ్‌ కాల్స్‌ వస్తున్నాయి

– తెలంగాణలో 43నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌టీపీ ప్రభావం : షర్మిల
– కేసీఆర్‌ వైఫల్యాలపై అఫిడవిట్‌ విడుదల
– డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నుంచి మిస్డ్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఏ కాల్‌ పిక్‌ చేసినా మీకే ముందు చెప్తా.. ప్రస్తుతం చార్జింగ్‌ మోడ్‌లో ఉన్నాం’ అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌. షర్మిల అన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయడం లేదని స్పష్టం చేశారు. విలీనం చేయడానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, తాను వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దని చెప్పదని, అలాంటప్పుడు పార్టీని విలీనం చేయాల్సిన అవసరంలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితే బాగోలేదని, 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వం ఉన్న పార్టీలోకి ఎలా వెళ్తానని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే సత్తా ఆ పార్టీకి ఉందా? అని ప్రశ్నించారు. ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి చెందిన జాతీయ సంస్థ చేసిన సర్వేలో తెలంగాణలో 43 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌టీపీ ప్రభావం చూపిస్తుందని రిపోర్టులు వచ్చాయని తెలిపారు. 10-20 సీట్ల కోసం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రజా, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక పార్టీ తమదేనని, ఎవరి దగ్గర సీట్ల కోసం తగ్గాల్సిన అవసరం లేదని వివరించారు. బెంగళూరులో పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌తో భేటీపైనా స్పందించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే డీకే శివకుమార్‌ రాజకీయం చేశారని, కష్టపడి పార్టీని గెలిపించారని తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఉన్నప్పటి నుంచి ఉన్న అనుబంధంతో కలిసి శుభాకాంక్షలు చెప్పినట్టు పేర్కొన్నారు.
బాండ్‌ పంపుతున్న సంతకం పెట్టు
ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో, టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ విషయంలో కేసీఆర్‌ వైఫల్యాలను గుర్తుచేస్తూ తయారుచేసిన అఫిడవిట్‌(బాండ్‌ పేపరు)ను విడుదల చేశారు. ఆ డిక్లరేషన్‌పై సంతకం చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అఫిడవిట్‌ను మీడియా ముందు విడుదల చేశారు. పేపర్‌ లీకేజీ విషయంలో టీఎస్‌పీఎస్‌సీ బోర్డును రద్దు చేసి పునర్నిర్మానం చేయలేదని చెప్పారు. పేపర్‌ లీకేజీకి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీకి ప్రతిపక్షాలే కారణమని కేటీఆర్‌ చెబుతున్నారని, ఆ ప్రతిపక్షాలెవరో బయటి పెట్టాలని సూచించారు.