మీకు పాటనిచ్చి పోతున్నానమ్మో…

I am going to give you a song...అరుణ పతాకానికి అగ్ని స్వరాలనందించిన ఆ కంఠం ఆగిపోయింది. చరిత్రపై చెరగని సంతకం చేసి వెళ్లిపోయింది. అతడు జనం గుండెల చప్పుడు… పీడితజన గర్జన… ప్రజా కళారంగానికి నూతన వొరవడి… సాంస్కృతికోద్యమ చరిత్రలో ఓ మైలురాయి. అతని పాట ఓ ఎర్రెర్రని బాట… విప్లవోద్యమానికి ఓ సరికొత్త నేపథ్య సంగీతం… ఒక్క మాటలో చెప్పాలంటే, పొడుస్తున్న పొద్దై ఈ నేలను ముద్దాడిన డెబ్బైనాలుగేండ్ల యుద్ధగీతం గద్దర్‌… ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని విషాదం
– అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో గద్దర్‌ అస్తమయం
–  సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివి పీపుల్స్‌వార్‌వైపు పయనం
–  ఉద్యమమేదైనా పాటే తన ఆయుధం
– ఆయన ప్రతిపాటా ఓ తూటా
– సంతాపం ప్రకటించిన శాసనసభ, మండలి
– నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు : సీఎం ఆదేశం
– ప్రజల సందర్శనార్ధం ఎల్పీస్టేడియంలో భౌతికకాయం
– సంతాపం తెలిపిన గవర్నర్‌, సీఎంలు కేసీఆర్‌, జగన్‌ , సీపీఐ(ఎం) నేతలు రాఘవులు, తమ్మినేని, బి.వెంకట్‌
– అపోలో ఆస్పత్రిలో గద్దర్‌ భౌతికకాయానికి రేవంత్‌, ఠాక్రే నివాళి
– సంతాపం తెలిపిన సాంస్కృతిక సంస్థలు, ప్రజా సంఘాలు, నవతెలంగాణ సీజీఎం పి. ప్రభాకర్‌, ఇన్‌చార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌
అక్షరాలనే ఆయుధంగా మలిచిన విప్లవ రచయిత, ప్రజాగాయకుడు గద్దర్‌ ఇకలేరు. ‘మీకు పాటనిచ్చి వెళ్తున్నానమ్మో’ అంటూ నింగికెసినారు. పొడుస్తున్న పొద్దుమీద పాటై వికసించిన ఆయన అస్తమించారు. తుపాకీ బుల్లెట్లకూ జడవని ఆయనను అనారోగ్యం ప్రజలకు దూరం చేసింది. ఆయన అకాల మరణంతో ఒక విప్లవ గొంతుక మూగబోయినట్టయింది. మేస్త్రీ అయిన తండ్రి ఇండ్లను నిర్మిస్తే..తాను మాత్రం ఉన్నతమైన సమాజాన్ని నిర్మించేందుకు తపించాడు. ఆ కోరిక తీరకుండానే మరణించినప్పటికీ..ఓ మార్గాన్నయితే చూపాడు. పాలకుల నిరంకుశత్వాన్ని, పెత్తందారీతనాన్ని పాటనే ఆయుధంగా మలిచి ఎలా ఎదుర్కోవాలో మార్గదర్శనం చేసి పోయాడు. గద్దర్‌ మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గుమ్మడి విఠల్‌రావు అలియాస్‌ గద్దర్‌(74) ఆదివారం కన్నుమూశారు. అమీర్‌పేట అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. ఆయన ఇటీవల గుండె పోటు వచ్చి ఆస్పత్రిలో చేరారు. జులై 20 నుంచి అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటున్నారు. ఈ నెల మూడో తేదీన గద్దర్‌ గుండెకు వైద్యులు బైపాస్‌ సర్జరీ చేశారు. ఆయన కోలుకుంటున్నట్టే కనిపించింది. కానీ, దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఊపరితిత్తులు, యూరినల్‌ వ్యాధుల తీవ్రత ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఆయనకు బీపీ ఎక్కువై ఆర్గాన్‌ లెవల్స్‌ పడిపోయి అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం అందించినప్పటికీ శరీరం సహకరించలేదు. ఆదివారం మధ్యా హ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ధ్రువీ కరిస్తూ అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆస్పత్రికి కళాకారులు క్యూ కట్టారు. సంధ్య, విమలక్క, తదితర కళాకారులు అక్కడకు చేరుకుని తుది నివాళి అర్పించారు. గద్దర్‌ మృతితో అల్వాల్‌లోని భూదేవినగర్‌లోనూ విషాదచాయలు అలుముకున్నాయి. గద్దర్‌ ఇంటికి బంధువులు, అభిమానులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. గద్దర్‌ మృతికి శాసనసభలో, శాసనమండలిలో సంతాపం ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికగాయాన్ని ఎల్బీ స్డేడియంలో ఉంచుతున్నట్టు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు. గద్దర్‌ అభిమానులు అక్కడకు రావొచ్చని సూచించారు. ప్రజాగాయకుడు గద్దర్‌ భౌతిక కాయాన్ని ఆస్పత్రిలో జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌, టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వారితో పాటు ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, మాజీ ఎంపీ వీహెచ్‌ ఉన్నారు. బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నేడు 11 గంటలకు మొదలుకానున్న అంతిమ యాత్ర
గద్దర్‌ అంతిమయాత్ర సోమవారం ఉదయం 11 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం కానున్నది. అంతిమయాత్రలో కళాకారులు, రాజకీయనాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొననున్నారు. ఎల్బీస్టేడియం-బషీర్‌బాగ్‌ చౌరస్తా-జగ్జీవన్‌ రాం విగ్రహం మీదుగా గన్‌పార్కు వరకు అంతిమయాత్ర సాగుతుంది. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అక్కడ నుంచి భూదేవినగర్‌లోని గద్దర్‌ నివాసానికి తీసుకెళ్తారు. భూదేవినగర్‌లోని మహాభారతి విద్యాలయ ఆవరణంలో గద్దర్‌ పార్ధీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం జారీ చేశారు. గద్దర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు.

సినిమా రంగంలోనూ..
గద్దర్‌ పలు సినిమాల్లోనూ నటించారు. పాటలు పాడారు. మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. యాదగిరి పాడిన ‘బండెనక బండి కట్టి’ అనే పాటను సినిమాలో పాడి, ఆడారు. ‘జైబోలో తెలంగాణ’ సినిమాలో ‘పొడుస్తున్న పొద్దుమీద..’ పాటను స్వయంగా రాసి, సినిమాలోనూ పాడి ఆడారు. తన పాట ద్వారా తెలంగాణ యువతను ఉర్రూతలూగించారు. బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ కేటగిరీలో ఆయన నంది అవార్డును పొందారు. ఆర్‌.నారాయణమూర్తి స్వీయ దర్శక్వంలో నిర్మించి నటించిన ఒరేరు రిక్షా సినిమాలో గద్దర్‌ రాసిన ‘ మల్లెతీగకు పందిరివోలే..మస్కచీకటి వెన్నెలవోలే..నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మో’ పాటకూ బెస్ట్‌ లిరిక్స్‌ కేటగిరీలో నంది అవార్డు వచ్చింది. కానీ, గద్దర్‌ తిరస్కరించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను నిరసిస్తూ తెరకెక్కించిన ఉక్కు సత్యాగ్రహం సినిమాలోనూ కీలకపాత్ర పోషించారు. ఆ చిత్రం త్వరలో విడుదల కానున్నది.
గద్దర్‌పై 32 కేసులు
పీపుల్స్‌వార్‌, తెలంగాణ ఉద్యమాల్లో ఆయనపై 32 కేసులు నమోదయ్యాయి. చాలా కాలం పాటు ఆజ్జాత జీవితం గడిపారు. నకిలీ ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా తనదైన శైలిలో గొంతు విప్పేవారు. ఎన్‌కౌంటర్ల బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి పరామర్శించేవారు. పోలీసుల తీరును ఎండగట్టేవారు. ఈ క్రమంలోనే ఆయనపై కాల్పులు కూడా జరిగిన విషయం తెలిసిందే.
విప్లవబాటలో…చర్చల్లో…అన్ని పార్టీలతో…
గద్దర్‌ పీపుల్స్‌వార్‌ మద్దతుదారుగా చాలా కాలం పనిచేశారు. కొంతకాలం అండర్‌గ్రౌండ్‌లో కూడా ఉన్నారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. అందులో ఆయన కీలకంగా పనిచేశారు. పీపుల్స్‌ వార్‌ నుంచి బయటకొచ్చి జనజీవస్రవంతిలో కలిశారు. అయినా, వామపక్ష ఉద్యమం వైపు నుంచే తన గొంతుకను వినిపించారు. ప్రభుత్వం- మావోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో మావోయిస్టుల ప్రతినిధులుగా గద్దర్‌, వరవరరావు పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలతోనూ కలిసి చురుకుగా పాల్గొన్నారు. వేదికలనూ పాలుపంచుకున్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర, టీమాస్‌ సభల్లో తన పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. అన్ని పార్టీల నేతలతోనూ సఖ్యతతో మెదిలారు. ఇటీవల ప్రజాపార్టీని పెడుతున్నట్టు కూడా ప్రకటించారు. తిరుగుబాటు, ఓటు ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చునని తెలిపారు.
గద్దర్‌ మృతికి సీపీఐ(ఎం), సీపీఐ, వామపక్ష పార్టీల సంతాపం
విప్లవ కవి, రచయిత, ప్రజా గాయకుడు గద్దర్‌ (అలియాస్‌ విఠల్‌రావు) మృతికి సీపీఐ(ఎం) సంతాపం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన పాదయాత్రలో, టీమాస్‌ సభల్లో ఆయన పాల్గొని ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనపై హత్యాయత్నం జరిగినా, వెన్నెముకలో తూటా ఉన్నా ఖాతరు చేయకుండా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై తన గళాన్ని వినిపించారని కొనియాడారు. ఆయన వేషధారణ ప్రజలను ఆకర్షించేదనీ, ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య జరిగిన శాంతి చర్చలలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. గద్దర్‌ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్‌) ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రన్న, తదితరులు సంతాపం ప్రకటించారు.
గద్దర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, తెలకపల్లి నివాళి
ప్రజాగాయకుడు గద్దర్‌ మరణం పట్ల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి సంతాపం తెలిపారు. గద్దర్‌ భౌతికకాయం ఉంచిన లాల్‌బహద్దూర్‌ స్టేడియంకు వెళ్లి, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాంస్కృతిక రంగానికి తీరని లోటు : సాహితీ సంస్థలు, ప్రజాసంఘాలు
గద్దర్‌ మృతికి నవతెలంగాణ దినపత్రిక సీజీఎం పి.ప్రభాకర్‌, ఇన్‌చార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా గాయకుడు గద్దర్‌ మృతి సాంస్కృతిక రంగానికి తీరని లోటని సాహితీ స్రవంతి ప్రకటించింది. ఈ మేరకు సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెంగార మోహన్‌, కె.సత్యరంజన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గద్దర్‌ తన పాటలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను చైతన్యపరిచాడని తెలిపారు. ప్రజాపాటల రచయితగా తెలుగునాట పేరొందిన ప్రజాగొంతుక గద్దర్‌ అని కొనియాడారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లాభాపురం జనార్ధన, కె.ఆనందాచారి సంతాపం తెలిపారు. అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగయ్య, వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, టి.సాగర్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్టీ, టి.స్కైలాబ్‌బాబు, టీజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీరాంనాయక్‌, వృత్తిసంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎంవీ.రమణ, తదితరులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మార్క్సిజం విశిష్టతను ప్రజల్లోకి గద్దర్‌ తీసుకెళ్లారు ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆనంద్‌, కె.నర్సింహ
మార్క్సిజం విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీవ్ర కృషి చేసిన వ్యక్తి గద్దర్‌ అనీ, ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వేముల ఆనంద్‌, కట్ట నర్సింహ పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యల్ని ఎత్తుకుని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారనీ, తన ఉద్యమ గీతాలను సామాన్యులకు అర్థమయ్యేరీతిలో పాడారని గుర్తుచేశారు. తెలంగాణ జానపదాన్ని విప్లవ, ఉద్యమ గీతాలుగా మలిచిన వ్యక్తి గద్దర్‌ అని కొనియాడారు. ప్రజానాట్యమండలి ద్వారా 33 జిల్లాల్లో సామాజిక న్యాయం, మార్క్సిజం విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేశారని తెలిపారు.
గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు, పలువురు సంతాపం
ప్రజాగాయకుడు గద్దర్‌ మృతికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంతాపం ప్రకటించారు. తెలంగాణ సమాజం గొప్ప రచయితను కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా యుధ్ధ నౌకగా పేరుగాంచిన కవి, రచయిత గద్దర్‌ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తుచేసుకు న్నారు. ఏపీ సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. దేశం మంచి ప్రజా గాయకున్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గద్దర్‌ మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన గళంతో కోట్ల మంది ప్రజలను గద్దర్‌ ఉత్తేజ, చైతన్యపరిచారనీ, ఆయన మరణం బాధాకరమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరుకుమార్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ‘పొడుస్తున్న పొద్దు మీద..’ పాట ఓ సంచలనం అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాల్లో ఆయనతో పలు వేదికలను పంచుకున్నానని గుర్తుచేశారు. సంతాపం తెలిపినవారిలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రా వు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బి.వినోద్‌కుమార్‌, మీడియా అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షు లు షర్మిల, తదితరులున్నారు. ఎంపీలు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష ్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ గౌడ్‌, మల్లు రవి తదితరులు సంతాపం తెలిపారు. గాంధీభవన్‌లో గద్దర్‌ చిత్రపటానికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కుమార్‌రావు, ప్రీతమ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజల రుణం తీర్చుకుంటా
”గుమ్మడి విఠల్‌ నాపేరు. గద్దర్‌ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 ఏండ్లు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 ఏండ్లు. ఇటీవల నేను పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రకు మద్దతుగా ”మా భూములు మాకే” నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్స కోసం అమీర్‌పేట శ్యామకరణ్‌ రోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో ఇటీవల చేరాను. జులై 20 నుంచి అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుటపడుతున్నాను. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వస్తాను. సాంస్కృతిక ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తాను. ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను’ అని ఇటీవల బహిరంగ లేఖ విడుదల చేశారు.
జననం..విద్యాభ్యాసం ఉద్యోగం..ఉద్యమం..
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తూప్రాన్‌లో గుమ్మడి లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1948లో గద్దర్‌ జన్మించారు. ఆయన అసలు పేరు. విఠల్‌రావు. తూప్రాన్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఆయన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు.1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా చేరారు. తర్వాత విమలను పెండ్లి చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. వారి పేర్లు సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో చనిపో యారు), వెన్నెల. 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడు దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత పీపుల్స్‌వార్‌, మావోయిస్టు, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ ఉద్యమాలకు తన పాటల ద్వారా బూస్టింగ్‌ ఇచ్చారు. 1969లో 42 మందితో కల్చరల్‌ బృందాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల్లో భావ విప్లవాన్ని తీసుకురావడానికి ఆయన సాంస్కృతిక ఉద్యమం వైపు అడుగులు వేశారు. తన పాటల తో సమాజాన్ని మేల్కొల్పే యత్నం చేశారు.
వెలుగులోకి రాని గద్దర్‌పై కాల్పుల నిజం
‘నాపై జరిపిన కాల్పులు ఎవరి జరిపారు నిజం తేల్చండి’ అంటూ గద్దర్‌ తన చివరి శ్వాస వరకు పోలీసు అధికారులకు అర్జీలు సమర్పిస్తూనే ‘పోయారు’. సీఎంలు, హోమంత్రులు, పోలీసు ఉన్నతాధికారులకు ఎన్ని వినతిపత్రాలిచ్చినా నిజం మాత్రం నిగ్గుతేలలేదు. 1997 ఏప్రిల్‌ ఆరో తేదీన భూదేవి నగర్‌లోని తన నివాసంలో గద్దర్‌ ఉండగా ఆయనపై ఐదుగురు అగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. గద్దర్‌ దేహంలోకి ఐదు బుల్లెట్లు దూసుకుపోయాయి. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్రచికిత్స జరిపిన డాక్టర్లు గద్దర్‌ శరీరం నుంచి నాలుగు బుల్లెట్లు మాత్రమే తీయగలిగారు. ఆ బుల్లెట్‌ ఆయన వెన్నుపూస మధ్యలో ఉండిపోయింది. అది తీస్తే ఆయన ప్రాణాలకే ముప్పు అని తేలడంతో డాక్టర్లు దాన్ని అలాగే వదిలేశారు. ఆ సమయంలో కాల్పులు జరిపింది తామే అంటూ గ్రీన్‌ టైగర్స్‌ పేరిట ఒక ఉత్తరం వెలువడింది. ఆ గ్రీన్‌ టైగర్స్‌ ఎవరో కాదు గ్రేహౌండ్స్‌ పోలీసులేనని ఆ సమయంలో గద్దర్‌తో పాటు ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. దానిని పోలీసు అధికారులు ఖండించారు. అగంతుకులను పట్టుకుంటామని ప్రకటించారు. చివరికి దర్యాప్తులో పురోగతి లేదంటూ పోలీసులు కేసు మూసివేయగా..ఆ కేసును తిరిగి తెరిచి తనపై కాల్పులు జరిపింది ఎవరనేది తేల్చాలని గద్దర్‌ నిరంతరం పోరాటం చేస్తూనే చనిపోయారు. ఆయనపై హత్యకు ప్రయత్నించింది ఎవరనేది మాత్రం మిస్టరిగానే మిగిలిపోయింది.
పాటల తూటా…
‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో..లచ్చుమమ్మో’ అంటూ అమ్మగురించి పాట పాడినా…’మల్లె తీగకు పందిరివోలే….నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మో….’ అంటూ అన్నా చెల్లెల్ల అనుబంధాన్ని ఎత్తిచూపినా..నన్ను గన్న తల్లులారా..తెలుగు తల్లి పల్లెలారా…పాటనై వస్తున్నానమ్మో…మీ పాదాలకు వందాల నమ్మో..’ పాటతో ఉర్రూతలూగించినా.. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..’ అన్న తెలంగాణ ఉద్యమ గొంతుకైనా..గద్దర్‌ పాడిన పాటలు దేనికవే ప్రత్యేకం. ఒక్కో పాట తూటా అయ్యి ప్రజల మనస్సులో నాటుకుపోయింది. ఎంతో మందిని ప్రజా ఉద్యమాలవైపు నడిపింది. ప్రజాసమస్యలపై చివరి వరకూ తన పాటల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించారు. తన విభిన్నమైన ఆహార్యం, వస్త్రధారణతో ప్రజల హృదయాలకు చేరువయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి బుర్రకథలను తయారుచేసి ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. దళితులు, పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కండ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలిపారు.