నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన నిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్ బీరప్ప నేతృత్వంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య నిమిత్తమై భయపడాల్సిన అవసరం లేదని, సాధారణమైన టెస్ట్‌లు మాత్రమే చేస్తున్నామని డాక్టర్ బీరప్ప తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. బుధవారం ప్రసాద్ ల్యాబ్ వద్ద ఉన్న ఆర్ నారాయణమూర్తికి సడెన్‌గా నీరసం రావడంతో, వెంటనే అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్‌కి చేరుకున్నారు. రెండు నెలల క్రితం ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని ఉండటంతో, డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. అయితే తన ఆరోగ్యం బాగోలేదని మీడియాలో వస్తున్న పలు వార్తల నేపథ్యంలో ఆర్.నారాయణమూర్తి స్పందించారు. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా.. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నా. దేవుడి దయతో బాగానే కోలుకుంటున్నా. పూర్తిగా కోలుకున్నాక అన్ని వివరాలు చెబుతాను. అప్పటివరకు ఎలాంటి వదంతులు నమ్మవద్దు’ అని నారాయణమూర్తి తెలిపారు.