అన్ని దిక్కులా దండయాత్ర చేస్తూనే వుంటుంది
నిరంతరం దొంగదెబ్బ తీస్తూనే వుంటుంది
కనపడని మిస్సైల్స్ ప్రయోగిస్తూనే వుంటుంది
కరచాలనాల పూలబొకే మాటున
చిట్లిన చిరునవ్వుల బాంబులు
విసురుతూనే వుంటుంది
డ్రోన్లతో ఢోకా చేస్తూనే వుంటుంది
గడ్డివాముల కింద పొంచివున్న కట్లపాము
రెండు నాల్కల కాలం సహాయం చేసిన చేతినే
అవకాశవాదం కత్తులు తెగనరుకుతూంటే
శత్రువులెవరో మిత్రులెవరో
తెలియని సందిగ్ధ సమరంలో…
బొంబాయి బాంబు దాడిలా
ఎప్పుడు ఎక్కడ వెన్నుపోటుల
సూసైడ్ బాంబులు పేలుతాయో
అంతుచిక్కని విధ్వంసం…
కన్ను మూసి తెరిచేలోపు
కలలసౌధాలు నేలమట్టమౌతారు
చితిమంటలతోనే చలి కాచుకుంటుంది లోకం!
శకలాలు శకలాలుగా
బతుకే ఒక గాజా దగ్థగీతం యైనపుడు
ఏవైపు నుండి ఏ అపవాదుల
అసత్యాల బాంబులు మీద పడుతాయో
నిరంతరం అభద్రతా భావం
ఇనుప కౌగిలిలో ఉక్కిరి బిక్కిరౌతూ…
బతుకే ఒక అధర్మ యుధ్ధభూమి యైనపుడు
హదయమెప్పుడూ నెర్రెలిచ్చిన గాజుబొమ్మే
నిరంతరం తప్పదు హాండిల్ విత్ కేర్
నిద్రలోనూ ఒక మెలకువ కావాలి
నేను నిరాయుధుడిలా అగుపించొచ్చు
న్యాయం మాత్రమే నా చేతి ఆయుధమై
ఒంటరి పోరు సలుపుతూనే వుంటుంది!
పోరాటం అనివార్యమైనపుడు
మడమతిప్పావో… ఇక నడిచే శవానివే
వెన్నుచూపడమంటే
మరణాన్ని మించిన ఓటమి కదా…
నడిచే గాయానైనప్పుడు
కాలం అగ్నిపర్వతం పై వాలిన పావురాన్నై
తిరుబాటు చేస్తూనే వుంటా
నిజాల నిప్పుల కొలిమినై …
శాంతి ఆయుధాల నందిస్తూనే వుంటా..
నిత్యం కడగండ్ల పై తలవంచని నెత్తుటి జెండానై
ఎగురుతూనే వుంటా లోకమంత చీకటి మీద పడ్డా
సంహరించే దీపఖడ్గానై విజయమో వీరస్వర్గమో
పోరాటమే నా తొలి విజయం!
అమరత్వం నా ఊపిరిలోనే వుంది
దానిపేరే అక్షరం
– సరికొండ నరసింహరాజు