లవ్‌, లస్ట్‌ నేపథ్యంలో ఈ కథలో నేను..

లవ్‌, లస్ట్‌ నేపథ్యంలో ఈ కథలో నేను..అవతార్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై ఎం.అచ్చిబాబు సమర్పణలో టి-కేశవ తీర్థ నిర్మించిన సినిమా ‘ఈ కథలో నేను’. బుర్రా సాయి మాధవ్‌ రచన చేసిన ఈ సినిమాకి ఎమ్మెస్‌ ఫణిరాజ్‌ దర్శకుడు. ఈ మూవీలోని పాటలు నచ్చి మంచి ఫ్యాన్సీ రేటుకి ఆదిత్య ఆడియో హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని దర్శకుడు క్రిష్‌ లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సాయి మాధవ్‌ బుర్రా రచనలో వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా ఈ ట్రెండ్‌కి, ఇప్పటి యూత్‌కి సరిపోయే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్లో ఉన్న డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. ఈ సినిమా డైరెక్టర్‌కి, టీమ్‌కి మంచి పేరు వస్తుంది. ఈ సినిమా మా సాయి మాధవ్‌కి మంచి పేరుతో పాటు మంచి విజయం అందించాలి’ అని అన్నారు. ‘సాయి మాధవ్‌ అందించిన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందర్నీ తప్పకుండా అలరిస్తాయి’ అని హీరో హోమానంద్‌ చెప్పారు.
సమర్పకుడు అచ్చిబాబు మాట్లాడుతూ, ‘అతి త్వరలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో సిరివెన్నెలతో పాటలు రాయించుకునే అదష్టం మా సినిమాకి, నాకు దక్కింది. సిరివెన్నెల తనయుడు యోగిశ్రీ దీనికి మ్యూజిక్‌ చేశారు’ అని దర్శకుడు ఎమ్మెస్‌ ఫణి రాజ్‌ చెప్పారు.