నేను నిర్దోషిని..

I am innocent..– పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి : రాహుల్‌
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో ఎలాంటి నేరానికీ పాల్పడలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేండ్ల శిక్షపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ‘మోడీ ఇంటి పేరు’ కేసులో ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేశారు.కర్నాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ‘దొంగలందరికీ మోడీ ఇంటి పేరే ఎందుకుంటుం ది’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేండ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద వయనాడ్‌ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్‌ కోర్టు
తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిన రాహుల్‌ గాంధీ తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేశారు.తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని రాహుల్‌ గాంధీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తానేమీ శిక్షార్హమైన నేరానికి పాల్పడలేదని తెలిపారు. ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడినని పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందువల్లే తాను ‘అహంకారి’ అని పూర్ణేశ్‌ మోడీ పేర్కొన్నారని తన అఫిడవిట్‌లో తెలిపారు. ఏ తప్పూ చేయకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్‌ నేరాలు మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయ వ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తనపై విధించిన శిక్షపై స్టే విధించి వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని రాహుల్‌ గాంధీ కోరారు.