– 23 నుంచి జిల్లాల్లో పర్యటిస్తా : వైఎస్ షర్మిల
అమరావతి : ఈ నెల 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రోజుకు మూడు జిల్లాల్లో పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ విజయవాడ వస్తారని.. ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. ‘రాజశేఖర్‌రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావడం… ఆ మాట కోసం పనిచేస్తున్నా. తెలంగాణలో ఓ నియంతను గద్దె దించాం. నా పాదయాత్ర ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటపడింది. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు.. నా లక్ష్యం నాకుంది. ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీని విలీనం చేశా. ఏపీ నాకు పుట్టినిల్లు.. స్వేచ్ఛగా పనిచేస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది’ అని తెలిపారు.