– బీజేపీతో టచ్…అబద్ధం
– ధరణి భూ ఆక్రమణలపై ఉక్కు పాదం
– రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం
– కేంద్ర పన్నుల వాటాపై శ్వేత పత్రం
– కాళేశ్వరం అవినీతిపై విచారణ కొనసాగుతోంది
– వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు: మీడియాతో చిచ్ చాట్‌లో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
” నేను ముఖ్యమంత్రి రేసులో లేను… సీఎం కావాలని అనుకోవట్లేదు.. ఆ ఆలోచన కూడా లేదు… అదంతా ప్రచారం… బీజేపీతో టచ్‌లో ఉన్నాననే వార్తలు అబద్ధం…. కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ అంటూ ఎవరూ లేరు….. ధరణి భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం…రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి అవినీతిని అరికడతాం …..కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాపై శ్వేతపత్రం తెస్తాం…కాళేశ్వరం అవినీతిపై విచారణ కొనసాగుతోంది…. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం” అని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
”కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్‌ని.. సీఎం పోస్టుకు సంబంధించి హైకమాండ్‌కు కూడా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారమే పార్టీ నిర్ణయముంటుంది…. అని” ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న కథనాలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తనపై పని గట్టుకుని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా బయట పెట్టి శ్వేత పత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో ప్రజలకవసరమున్న మాడ్యూల్స్‌ను ఉంచి, ఇబ్బంది కలిగించే అంశాలను తొలగిస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి, అవినీతిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసే వారిని ఎన్నికల అనంతరం బదిలీ చేస్తామని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు. ”రాష్ట్రంలో సాగు, తాగు, నీరు అందక పోవడానికి పూర్తి బాధ్యత గత సర్కార్‌దే….జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫొటోలు, వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాయి…. మా ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్‌లో… రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంది… కాని చేయాల్సిన పనులు చేయకుండా బాధ్యత విస్మరించి మాపై రాళ్ళేయడం తగదు…. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందే…. ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతోంది… ఆ ప్రాజెక్ట్ మూడు పిల్లర్ల డ్యామేజీతో ఆగదు… మొత్తం బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉంది. కాళేశ్వరంలో నీటిని నిల్వ చేయాలంటూ కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని” మంత్రి ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌పై మేం కక్షపూరితంగా కేసులు పెడుతున్నామంటూ కొంత మంది మాట్లాడుతున్నారు… అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై మాత్రమే మేం స్పందిస్తున్నామని తెలిపారు. తామెవరిని టార్గెట్ చేసి కేసులు పెట్టడంలేదని పేర్కొన్నారు. అదే సందర్భంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ము ఏ రూపంలో, ఎక్కడ ఉన్నా కక్కిస్తామని హెచ్చరించారు. ఐదెకరాల రైతులందరికి రైతు బంధు త్వరలో అందిస్తామని చెప్పారు. కొన్ని విభాగాల సిబ్బందికి జీతాల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేననీ, ఆయితే ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అయినందునే తమకు ఎంఐఎం మద్దతు తెలపుతోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 14 సీట్లల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడు సీట్లలో మాత్రం కొంత పోటీ ఉంటుందని చెప్పారు. తమకు ప్రధాన పోటీ బీజేపీతోనేనని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌కు ఒకట్రెండు సీట్లు వస్తే ఎక్కువని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని పడగొడుతామని బీఆర్‌ఎస్ నేతలు పదే పదే చేస్తున్న ప్రకటనల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గేట్లేత్తలేదనీ, నిజంగా గేట్లెత్తితే బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. తామెవరిని రమ్మని అడగకున్నా వారే వస్తామంటూ అడుగుతున్నారని గుర్తు చేశారు.