నేను ఇంకా ఓటరునే!

నేను ఇంకా ఓటరునే
చేతులెత్తే కాలము నుండి
మీట నొక్కే కాలము వరకు
అప్పటి ప్లేటో ఘనస్వామ్యం నుండి
ఇప్పటి ప్రజాస్వామ్య కాలం వరకు
ఓటు వేసినాక అనాధ ఓటరునే!
సాంకేతిక యుగం అయినా
వేలిపై చెరగని ఇంకుచుక్క యింకా
పొడిపించుకుంటున్న
పామర ఓటరు నే!
ఇంకు చుక్క ఆరక ముందే
ప్రమాణం చేసి గెలిసినోడు
పార్టీలు మారితే యింకా
అడిగే హక్కు లేని అనామక ఓటరునే!
ఒకడు ఎన్ని చోట్లైనా పోటీ చేయవచ్చు
మళ్లీ మళ్లీ ఎలక్షన్లు తేవచ్చు
నేను ఒక్కచోటే ఓటు వేసి ప్రాణం పోసి
యమపాశం వేయలేని ఓటరునే!
ఇంటర్నెట్లు ,సెల్‌ ఫోన్లు, టీవీలు
సిసి కెమెరాలు ప్రత్యక్ష ప్రసారాలు
ఎన్ని ఆధునిక మార్పులు వచ్చిన
బహిరంగ సభలకు లారీల్లో బస్సుల్లో
ఎండలల్ల, వానలల్ల ఎగతేకుకుంటూ
ఎగబడుతున్న ఎర్రి ఓటరు నే!
పలు రకాల పథకాల పట్టాలపై
ప్రగతి రథం పరుగులు పెడుతుంటే
నేను ఇంకా బహిరంగ సభలలో
జై కొట్టి, నై కొట్టే ఓటరు నే!
– పి.బక్కారెడ్డి, 97705315250