కింద పడ్డ నేనే గొప్ప!

కింద పడి ఎవరూ చూడకుండా టక్‌న లేచి ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తుంటాం. ఇది సాధారంగా ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొంతమంది కింద పడ్డ నేనే గొప్ప అన్నంతగా ఫీలౌతుంటారు. ఈ విషయం కచ్చితంగా కమలనాథులకు వర్తిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నా… తామే గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ అంశాన్ని వాట్సాప్‌ యూనివర్సిటీ భుజాన మోస్తున్నది. బీజేపీకి 400 సీట్లు వస్తాయంటూ మోడీ డాంభికాలు పలికారు. కానీ 240 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇన్ని సీట్లు వచ్చినా బీజేపీ సంబరాలు చేసుకోవట్లేదట. కానీ 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌ మాత్రం సంబురాలు చేసుకుంటుందని ఏడుస్తుంది.ఆ పార్టీకి సిగ్గూ లేదని దెప్పిపొడుస్తున్నది. అసలు విషయాలను మరుగుపరిచి పక్కొడి మీద పడి ఏడవడమే దాని పని. దేవుడు కరుణించలేని విధంగా అయోధ్యలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయినా, ఆ విషయం మాత్రం సోషల్‌మీడియా సెలబస్‌లో ఉండదు. మోడీకి భారీగా మెజార్టీ తగ్గడంతో ఆయనపై ఆరెస్సెస్‌ గుర్రుగా ఉన్నా… అది కూడా వారి ట్రోలింగ్‌లో కనిపించదు. ప్రఖ్యాత రామ మందిరం ఉన్న అయోధ్య, భద్రాచలం, రామేశ్వరం, కొప్పల్‌, నాసిక్‌, చిత్రకోట వంటి ప్రాంతల్లో సైతం కమలం దెబ్బతిన్నది. అయినా పొద్దున లేస్తే సోషల్‌ మీడియాలో మాత్రం మోడీ భజన ఆపడం లేదు. దటీజ్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ!
– గుడిగ రఘు