– తెల్లోళ్లకు తొత్తులుగా పనిచేశారు
– గాంధీ మార్గంలోనే తెలంగాణ స్వప్నం సాకారం
– సకల జనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం
– స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటీష్ పాలనే బాగుందనీ, వారు మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారంటూ కొందరు దురాలోచనాపరులు తెల్లోళ్లకు తొత్తులుగా పని చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాంటి ప్రబుద్ధులు నేడు కూడా ఉన్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. మహాత్ముని విగ్రహానికి, భరతమాత చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ గాంధీ మార్గంలోనే తెలంగాణ స్వప్నం సాకారమైందని గుర్తు చేశారు. సకల జనుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్వేయమని స్పష్టం చేశారు. స్వాంతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని అన్నారు. స్వామి వివేకానంద భారతీయుల్లో జాతీయ స్పహను రగిలించారని సీఎం తెలిపారు. ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకుల్లో మహాత్మాగాంధీ అగ్రగణ్యులని కొనియాడారు. యుద్ధాలతో సతమతమవుతున్న మానవ జాతికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను గాంధీ పరిచయం చేశారని చెప్పారు. మత సామరస్యం కోసం జీవితాంతం పోరాడిన మహాత్ముడు చివరికి మతోన్మాదుల శక్తుల చేతుల్లోనే హత్యకు గురి కావడం చారిత్రక విషాదమన్నారు. గాంధీ భారతదేశంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై కూడా తన ముద్ర వేశారని తెలిపారు. ఆయన చూపిన అహింసా మార్గంలో స్వాతంత్రోద్యమం విజయ తీరాలకు చేరిందని తెలిపారు.
చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వంటి అనేకమంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని చెప్పారు. సాయుధ సమరాన్ని నడిపిన సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికీ మనందరికీ గొప్ప ప్రేరణను ఇస్తుందని అన్నారు.
గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేదని, టీఆర్‌ఎస్‌ను స్థాపించినపుడు అహింసాయుత ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని స్పష్టంగా ప్రకటించానని గుర్తుచేశారు. మొదట ఈ అభిప్రాయంతో కొందరు ఏకీభవించలేదు, కానీ రానురాను అందరూ తాను ఎంచుకున్న మార్గమే సరైనదని అంగీకరించి వెంట నడిచారని తెలిపారు.
స్వరాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాం, దాంతో గ్రామాలు సుసంపన్నంగా మారాయని ఆయన వివరించారు. ప్రజలందరికీ మంచినీళ్లను అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. నిబద్ధత, నిజాయితీ జనావళికి అభయమనీ, ముమ్మాటికే తమనే విజయం వరిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని చేయని విధంగా ఏడాదికి పైగా అనేక కార్యక్రమాలను, ఉత్సవాలను నిర్వహించా మని తెలిపారు. దేశస్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, చైతన్యదీప్తిని భావి తరాలకు తెలియచేసే గొప్ప ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్, వజ్రోత్సవ కమిటీ చైర్మెన్ కేశవరావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీజీపీ అంజనీ కమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.