‘ది ఎయిటీన్త్ బ్రూమేర్ లూయీస్ బోనపార్టే’ అనే తన గ్రంథం ప్రారంభ వాక్యాలే హెగెల్‌పై వ్యంగ్య బాణాలు సంధిస్తాడు కారల్ మార్క్స్. చరిత్రలో బ్రహ్మాండమైన నిజాలు, వ్యక్తులు రెండుసార్లు పునరావృతమైతా యంటాడు హెగెల్ ఒకానొకచోట. కాని ఆయన రెండు విషయాలు చెప్పటం మరిచిపోయాడంటాడు మార్క్స్. మొదటిసారి ట్రాజెడీగానూ, రెండవసారి ఫార్స్ (ప్రహసనం)గానూ పునరావృతమైతా యంటాడు ఆయన. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తీరు చూసి, మరీ ముఖ్యంగా ఆశా వర్కర్ల విషయంలో.. కాదు.. కాదు.. ”ఆడబిడ్డల” విషయంలో, రైతులు, వారికేసిన సంకెళ్ల విషయంలోనూ బీఆర్‌ఎస్ వారి మొసలి కన్నీరు చూసి సముద్రాలు చిన్నబుచ్చుకుంటున్నాయి.
కల్వకుంట్ల కుటుంబానికి దృగ్గోచరమయ్యే విషయాలన్నీ ఉల్టాగానే ఉన్నట్టున్నాయి. తమ ఏలుబడిలో ఆశాలు (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్) 106 రోజుల సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది కేసీఆర్ అహంకారం. చివరికి వాళ్ళే ఒకడుగు వెనక్కి తగ్గారు. సింగరేణిని బంద్ పెట్టింది నాటి రాష్ట్ర సాధనోద్యమం. ఆర్టీసీ ‘ప్రగతి’ చక్రాలు నిలిచి పోయాయి. సకల జనుల సమ్మె రాష్ట్ర సాధనను నిజం చేసింది. ఇది వ్యక్తుల కాపాదిస్తే కుదరదు. ఆ తర్వాత కేసీఆర్ అహంకారం రాష్ట్రంలో శ్మశాన శాంతి నెలకొల్పే ప్రయత్నం చేసింది.
2013లో జరగాల్సిన వేతన ఒప్పందం కోసం 2015లో సమ్మె కట్టిన పాపానికి అంతవరకు చంకనెత్తుకున్న సంఘంతో సహా ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలనూ ఈడ్చి నేలకేసి కొట్టడమేగాక ఆర్టీసీలో యూనియన్లనే నిషేధించాడాయన. సింగరేణిలో ప్రధాన యూనియన్లను నియంత్రించగలగడం, కాంట్రాక్టు కార్మికులు హక్కులడగకుండా అణిచివేయడంతో కణకణమండే బొగ్గు బావులపై కుండపోతవాన కురిపించాడు. దీనికితోడు ఎర్రజెండాలు పట్టుకుంటే కేసీఆర్ కానడనే మానసిక యుద్ధం నడిపారు సర్పంచ్ మొదలు మంత్రుల స్థాయి వరకు. కింద అసంతృప్తి రాజుకుంది. కార్మికులు నష్టపోతూనే ఉన్నారు. ఏదో ఒక మేర ఇతర వర్గాల ప్రజలూ, ముఖ్యంగా కష్టజీవులు నష్టపోయారు.
ఫలితమే 2023 డిసెంబరు 7న కనబడింది. జనం ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో కాంగ్రెస్ పాలనను తెచ్చుకున్నారు. ప్రజల్ని ఏమార్చడంలో ఢక్కామక్కీలు తినున్న ఈ పాలకులు ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మతోన్మాద శక్తులు పెరగడానికి సాగుభూమిగా ఉన్న తెలంగాణలో పాగా వేసే ప్రమాదం లేకపోలేదు. యాసంగి దాటిపోతున్నా రుణమాఫీ ఒక కొలిక్కి రాలేదు. పంచపాండవులంటే నాకు తెలీదా అని నాలుగు వేళ్లు చూపి.. చివరికి గుండు సున్నా చుట్టాడట వెనకటికెవరో! ‘రైతు భరోసా’ బీఆర్‌ఎస్ కంటే ఎక్కువిస్తామంటే రైతులు ఆశపడ్డారు. బీఆర్‌ఎస్ కాలంలో అమెరికాలో ఉండే వారికి కూడా అకౌంట్లలో జమ అయ్యింది అన్యాయంగా. వాస్తవ సాగుదారులకే ఇస్తామనడం కూడా న్యాయమేకాని, ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ అసలు ప్రారంభం చేసేదెపుడని రైతాంగం ప్రశ్నిస్తూంది. అవసరమైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లన్నారు, ఇళ్ల స్థలాలన్నారు. నిర్దిష్టంగా ఎన్నిచోట్ల ఎంత మందికిచ్చారో చెప్పగలరా? కేసులన్నీ రద్దుచేస్తున్నామన్నారు. ఇంకా రెండున్నర వేలమందిపై కేసులు అలాగే ఉన్నాయి. ఉపాధి హామీ పనిదినాలు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూంటే దానిపై తలుపు చెక్కలెత్తాల్సిందిపోయి తమలపాకులతో, సరసపుమాటలతో కితకితలు పెడితే పనులు కావని 2018 వరకు కేసీఆర్ సర్కారే ఉదాహరణనున్నా పట్టించుకోదలుచుకోలేదో ఏమో!
కోటి మంది కార్మికుల వేతనాల పునరుద్ధరణ 2012 నుండి జరగలేదు. కంచెలను ధ్వంసం చేశామనే వారికి ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలనే సోయి లేదనుకోవాలా? లేదా కటకటాల్లో నుండి వాటిని బయటికి ఎందుకు వదలాలనుకుంటున్నారా?
2015 నుండే మోడీ త్రైపాక్షిక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌కు చెల్లు చీటీ ఇచ్చేసింది. కార్మికులతో, వారి సంఘాలతో చర్చలే లేవు. చూశాము కదా ఢిల్లీ చుట్టూ అంత పెద్ద ఉద్యమం జరిగితే, వెనక్కి తగ్గినట్టే తగ్గి దొడ్డిదోవన ముందుకుపోయే ప్రయత్నం చేస్తోంది మోడీ ప్రభుత్వం. వీటన్నింటిని గమనించి, పోరాటాలను చూసయినా ఏలిన వారు తీరు మార్చుకోవాలి. చచ్చేంత చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనం, కార్మికులుగా గుర్తింపు మొదలైన సమస్యలేవీ పరిష్కరించడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు జరుపుతున్న బస్సు జాతాకు ప్రభుత్వం స్పందించాలి. లేదంటే, నిరసనలు, ఆందోళనలు అవిశ్వాసాలై వెల్లువెత్తుతాయి. డిసెంబరు 15న ప్రారంభమైన ఈ బస్సు యాత్ర ఆశాలనే కాక నిరాశలో మగ్గుతున్న ”కూడు లేని, గూడు లేని” జనాన్ని ప్రోది చేస్తుందని, చేయాలని ఆశిద్దాం.