నేను రాలేను..

– అయోధ్యకు ఆహ్వానాన్ని తిరస్కరించిన అంబేద్కర్‌ మనవడు
– మత సంబంధమైన కార్యక్రమాన్ని రాజకీయ ప్రచారంగా మార్చారు..
ముంబయి: అయోధ్యలో ఈ నెల 22న జరగబోయే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా వచ్చిన ఆహ్వానాన్ని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ మనవడు, మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది ప్రకాశ్‌ అంబేద్కర్‌ తిరస్కరించారు. ఇది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమమైనందున ఈ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మత సంబంధమైన కార్యక్రమాన్ని రాజకీయ ప్రచారంగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. దురాశ, స్వప్రయోజనాలు దేశ ప్రయోజనాల కన్నా మిన్న అని పార్టీలు భావించిన పక్షంలో మన స్వాతంత్య్రం మరోసారి ప్రమాదంలో పడుతుందని, బహుశా శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా వుంటుందని తన తాతగారు బి.ఆర్‌.ఆంబేద్కర్‌ ఆనాడే హెచ్చరించారని గుర్తు చేశారు. తన తాతగారు వ్యక్తం చేసిన భయాందోళనలు ఈనాడు నిజమయ్యాయని అన్నారు.