నేను ఎలాంటి సమాధానాన్నీ ఆమోదించలేదు

– పార్లమెంట్‌లో ‘హమాస్‌ సంస్థ’పై కేంద్ర మంత్రి మీనాక్షి
న్యూఢిల్లీ : పాలస్తీనాకు చెందిన హమాస్‌ సంస్థపై పార్లమెంటులో ఒక ప్రశ్నకు సంబంధించి వివాదం చెలరేగుతున్నది. హమాస్‌ను భారత్‌లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు తాను ఎలాంటి జవాబునూ ఆమోదించలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పష్టం చేశారు.
జర్నలిస్ట్‌ సిధాంత్‌ సిబల్‌ శుక్రవారం లేఖి పేరును సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ప్రస్తావిస్తూ పార్లమెంట్‌ వెబ్‌సైట్‌ నుంచి అధికారిక ప్రతిస్పందనను పోస్ట్‌ చేసిన తర్వాత ఇది జరిగింది. లేఖి శనివారం సిబల్‌ చేసిన ట్వీట్‌పై స్పందించారు. ”నేను ఈ ప్రశ్నతో ఏ పేపర్‌పై సంతకం చేయలేదు. మీకు తప్పుడు సమాచారం అందింది” అని కేంద్ర మంత్రి అన్నారు. పార్లమెంటు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రశ్నను కాంగ్రెస్‌ లోక్‌సభ ఎంపీ కె సుధాకరన్‌ సంధించారు. భారతదేశంలో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రతిపాదన ఏమైనా ఉందా అని సదరు ఎంపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం భారత అధికారులకు ఏమైనా డిమాండ్‌ చేసిందా అని కూడా అడిగారు.