– కాళేశ్వరంపై ప్రజాభిప్రాయసేకరణ
– అవసరమైతే కేసీఆర్‌నూ విచారిస్తాం
– నివేదికల ఆధారంగా పనిచేస్తాం : బాధ్యతల్లోకి జస్టిస్ ఘోష్
– మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్
– ఫిర్యాదులకు ఆహ్వానం : రాహుల్ బొజ్జా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని జ్యుడీషియల్ విచారణ కమిషన్ చైర్మెన్ రిటైర్డ్ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ వ్యాఖ్యానించారు. అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్‌ను పిలిచి సమాచారం తీసుకుంటామని చెప్పారు. దీంతో సంబంధము న్న నిర్మాణ సంస్థలు, రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టుల ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు. గురువారం హైదరాబాద్ లోని బీఆర్‌ఆర్‌కే భవన్‌లోని ఆయన కార్యాలయానికి వచ్చారు. నోడల్ అధికారులతో తొలుత భేటీ అయ్యారు. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆయన్ను కలిశారు. అనంతరం మీడియాతో స్వల్ప సమయం చిట్‌చాట్ చేశారు. కాళేశ్వరంపై నిపుణుల అభిప్రాయాలను తీసుకుని విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వెళ్లి బ్యారేజీలను పరిశీలిస్తామని తెలిపారు. కుంగిన పిల్లర్లను చూసి, ప్రాజెక్టు డ్యామేజీ తీవ్రతను అంచనా వేస్తామని చెప్పారు. త్వరలోనే అవకతవకలపై పత్రికా ప్రకటనలు ఇచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ప్రకటించారు. మూడు రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామ న్నారు. సాంకేతిక అంశాలనూ పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తామన్నారు. నేను ముఖాలు చూసి విచారణ చేయనని వ్యాఖ్యానించారు. ఎన్‌డీఎస్‌ఏతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లతో సమావేశమవుతానని వివరించారు. న్యాయ సమస్యలు రాకుండా విచారణ చేస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామన్నారు. తొమ్మిది రకాల సమాచారాన్ని జస్టిస్ ఘోష్‌కు సాగునీటి శాఖ అధికారులు ఇవ్వగా, మరింత సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. శుక్ర, శనివారాల్లో అధికారులతో ప్రాజెక్టుపై సమగ్ర వివరాలు సేకరించనున్నారు. వారితో సమావేశమై ప్రాజెక్టుకు ఏర్పడిన ముప్పు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. కమిషన్ విచారణా కార్యాలయాన్ని బీఆర్‌ఆర్‌కే భవన్‌లోని 8వ అంతస్థులో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తొలిదశలో కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ, అధికారులతో సమావేశాలు చేపట్టనున్నారు. రెండో దశలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బ్యారేజీలను పరిశీలించనున్నట్టు తెలిసింది.
విచారణకు సహకరిస్తాం: జస్టిస్ ఘోష్‌తో మంత్రి ఉత్తమ్
జస్టిస్ చంద్రఘోష్ కమిషన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్‌ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రఘోష్ కమిషన్‌కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని చెప్పారు. అవకాశం ఉంటే బ్యారేజీలకు మరమ్మతులు చేసి వచ్చే సీజన్‌కి డ్యామ్‌ని ఉపయోగంలోకి తేవాలని ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కమిషన్‌కు అడిగిన వివరాలు, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఉత్తమ్‌కుమార్ స్పష్టం చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు రానుంద న్నారు. కేవలం రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా ఉంటాయని వ్యాఖ్యానించారు.
ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ :రాహుల్‌బొజ్జా
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, నివేదనల సమర్పణకు ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసింది. దరఖాస్తులను సీల్డ్ కవర్‌లో విచారణ కమిషన్‌కు అందజేయవచ్చని తెలియజేసింది. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల్లోపు హైదరాబాద్‌లోని బీఆర్‌ఆర్‌కే భవన్ 8వ అంతస్థులోని కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా గానీ, లేదా పోస్టు ద్వారా సమర్పించే అవకాశాన్ని కల్పించారు. మే 31 వరకు నోటరీ అఫిడవిట్లు జత చేసి, సాక్ష్యాలతో ఫిర్యాదులు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ, నాణ్యత, నిర్మాణపరమైన లోపాలు, బాధ్యులను గుర్తించడం, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై కమిషన్ విచారణ చేయనున్నది. ఈ మేరకు గురువారం సాగునీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. సాక్ష్యాధారాలు లేని ఫిర్యాదులను తిరస్కరిస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం విచారణ కమిషన్, బీఆర్‌ఆర్‌కే భవన్, డి బ్లాక్, 8వ అంతస్థు, సచివాలయం సమీపం, హైదరాబాద్-500063 చిరునామాకు ఫిర్యాదులు పంపవచ్చని గుర్తు చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం, 1952(కేంద్ర ప్రభుత్వం చట్టం నెంబరు 60/1952, సెక్షన్ 3) ద్వారా సంక్రమించిన అధికారాలతో జస్టిస్ పినాకిని ఘోష్ విచారణ కమిషన్‌ను ప్రభుత్వం నియమించినట్టు తెలిపారు.