– మేం ఎవరికీ బీ టీం కాదు
– కాంగ్రెస్ సచ్చిన పాముతో సమానం : నిర్మల్ సభలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- దిలావర్‌పూర్
తెలంగాణకు నేను ముఖ్యమంత్రి కావాలంటే ప్రధాని మోడీ ఎన్‌ఓసీ(నిరభ్యంతర పత్రం) ఇవ్వాల్సిన అవసరం లేదని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నిజామాబాద్ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మేము ఢిల్లీకి గులాం కొట్టబోమని.. ఎవరికీ బీ టీం కాదని స్పష్టం చేశారు. గాలి మోటరు మీద వచ్చిన మోడీ గాలి మాటలు మాట్లాడి వెళ్లారని ఎద్దేవా చేశారు. బుధవారం నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి రూ.1157కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 2014లో గ్యాస్ సిలిండర్ రూ.400 ఉండగా మోడీ ప్రధాని అయ్యాక ఏకంగా రూ.1450కి చేరిందని తెలిపారు. అప్పట్లో సిలిండర్ ధర పెరిగితే అప్పటి ప్రధాని మన్మోహన్‌ను మోడీ తీవ్రంగా విమర్శించారని, మరి ఈ రోజు బీజేపీని ఏమని తిట్టాలని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ, నిర్మల్ జిల్లా సాకారం, మెడికల్ కళాశాల, తదితర పథకాలు అందించిన కేసీఆర్‌ను బండి సంజరు దెయ్యంతో పోల్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున జమ చేస్తామని చెప్పిన మోడీ ఇంత వరకు ఒక్క రూపాయి వేయలేదని విమర్శించారు. ఆ రూ.15లక్షలు ఎక్కడ పోయాయో బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సచ్చిన పాముతో సమానమని విమర్శించారు. ఆరు గ్యారంటీలతో సచ్చిన పామును లేపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందేనని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ 70ఏండ్ల పాలనలో ఏం చేసిందో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మీ, ఎమ్మెల్సీ దండె విఠల్, నీటిపారుదలశాఖ కార్పొరేషన్ చైర్మెన్ వేణుగోపాలచారి, ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్‌నాయక్, బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు.