– హింసాత్మక కంటెంట్‌పై నిషేధం
– మణిపూర్ రాష్ట్ర సర్కారు ఆదేశం
ఇంఫాల్ : మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక చిత్రాలు, వీడియోలపై మణిపూర్ ప్రభుత్వం నిషేధం విధించింది. చిత్రాలు, వీడియోలు ఎవరైనా ప్రసారం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఒక వ్యక్తి మృతదేహాన్ని కందకంలో కాల్చినట్టు చూపించే వీడియో సోషల్ మీడియాలో వెలువడిన మూడు రోజుల తర్వాత రాష్ట్ర హౌం శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మే 4వ తేదీకి సంబంధించిన వీడియో అని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి ఫోటోలు, వీడియోలు ఆందోళనకారుల గుంపులను సమీకరించగలవనీ, దీంతో శాంతిభద్రతల ఆందోళనలు తీవ్రతరం అవుతాయని ప్రభుత్వం తెలిపింది. సాధారణ స్థితిని తీసుకురావడానికి ఇటువంటి విషయాలను నిరోధించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. హింస, ద్వేషాన్ని ప్రేరేపించడానికి ఎవరైనా సాంకేతికతను దుర్వినియోగం చేస్తే సమాచార సాంకేతిక చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత నిబంధనల ప్రకారం తగిన విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హౌం శాఖ వివరించింది. మే ప్రారంభంలో మణిపూర్‌లో వివాదం చెలరేగినప్పటి నుంచి హింసకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.జులై 19న ఇద్దరు కుకీ మహిళలను ఒక గుంపు నగంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలకు దారి తీసిన విషయం విదితమే. మే 4న మహిళలపై దాడి జరగగా.. మే 18న కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాతే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేయటం గమనార్హం. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం హింసను అణచివేయటంలో విఫలమైందనీ, బాధితులపై జరిగే అకృత్యాలను ఆపలేని ప్రభుత్వం సంబంధిత చిత్రాలు, వీడియోలో సర్క్యులేషన్‌ను అడ్డుకోవడానికి నిర్ణయించిందని సామాజికవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు.