పాయల్ కపాడియా… మహిళా ప్రధాన్యం గల చిత్ర నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2017లో ఆమె నిర్మించిన ఆఫ్టర్ నూన్ క్లౌడ్స్ 70వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ చిత్రానికి గాను 2021లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా గోల్డెన్ ఐ అవార్డు గెలుచుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది విడుదలైన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే చిత్రం ద్వారా భారతీయ ప్రస్తుత రాజకీయాలు, ముంబయిలో మహిళా నర్సుల జీవితాలను చూపించి మరో సారి కేన్స్‌లో పోటీ పడుతున్న ఆమె ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు మానవి పాఠకుల కోసం…
ఓటీటీ వల్ల భారతీయ సినీ పరిశ్రమ ఎలాంటి మార్పులకు దారితీసింది?
నేను చెప్పబోయేది వివాదాస్పదంగా అనిపించవచ్చు. భారతీయ సినిమా అభివృద్ధి చెందుతోంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటీ అర అవార్డులు గెలుచుకున్నంత మాత్రానా మనం గొప్పగా ఉన్నామని చెప్పలేను. కొన్నిసార్లు అంతర్జాతీయ ఉత్సవాలు మన చిత్రాలను అర్థం చేసుకోలేవు. కేన్స్‌లో ఉండగలిగేందుకు నాకు సంతోషమే. కానీ మన సొంత దేశంలోనే మనకు బలమైన వ్యవస్థ ఉంది. మన ప్రేక్షకుల గురించి ఆలోచించాలి. మన భారతీయ సినిమాల్లో వైవిధ్యం గురించి సంతోషించాలి. ఉదాహరణకు కేరళలో ప్రతి జిల్లాలో ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతాయి. మా మహారాష్ట్రలో కూడా జరుపుతారు. భారతదేశంలో మనం చేసే సినిమాలన్నింటికీ ప్రేక్షకులు ఉన్నారు. ఫిల్మ్ మేకింగ్ మరింత అందుబాటులోకి వస్తోంది. మహిళా చిత్రనిర్మాతలను కూడా మనం ఎక్కువ మందిని చూస్తున్నాం. అస్సాంకి చెందిన రీమా దాస్ లాంటి వారికి సినిమాకు సంబంధించిన అన్ని విషయాపై అవగాహన ఉంది. ఆమె షూట్‌తో పాటు ఎడిట్ కూడా చేస్తుంది. మన చిత్రనిర్మాతల్లో ఎంత వైవిధ్యం ఉంటే, మన సినిమా ఆటోమేటిక్‌గా మరింత ఆసక్తికరంగా మారుతుంది.
నర్సుల గురించి సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
ఎఫ్‌టీఐఐ విద్యార్థిగా నేను షార్ట్ ఫిల్మ్ తీయాల్సి వచ్చింది. ఆ సమయంలో ముంబైలో పని చేయడానికి వచ్చే మహిళగా ఎలా ఉంటుందో నాకు ఆసక్తి కలిగింది. నేను కొంతమంది నర్సులతో మాట్లాడాను. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితంలో కేరళ నుండి వచ్చిన నర్సులు నన్ను చుట్టుముట్టారు. మా నాన్న ఆసుపత్రిలో ఉన్నారు. నేను లోతుగా పరిశీలించినపుడు ఇది నా స్టూడెంట్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, సుదీర్ఘమైన చిత్రం కావాలని నాకు అనిపించింది. అందుకే పక్కన పెట్టాను. అయితే అప్పట్లో అను పాత్ర కోసం సంప్రదించాను. సమయం గడిచేకొద్దీ ముంబై, దాని వైరుధ్యాలు ప్రాజెక్ట్‌లోకి ప్రవేశించాయి. మహమ్మారి సమయంలో ప్రజలు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ముంబై విడిచిపెట్టి పోతున్నారు. ఇది కూడా ప్రభావితమైంది. డబ్బు సమకూర్చుకునేందుకు చాలా సమయం పట్టింది. నాకు మలయాళం రాదు. దాంతో ప్రీ-ప్రొడక్షన్‌కి ఏడాది పట్టింది. నా స్నేహితుడు, సహోద్యోగి రాబిన్ జారు డైలాగ్స్ రాయడంలో నాతో కలిసి పని చేశాడు. ఆ తర్వాత దివ్యతో కలిసి పని చేశాం. ఇది నా మొదటి సినిమా కాబట్టి ప్రిపరేషన్ నాకు చాలా ముఖ్యం.
నగరంలో వలసదారుల అనుభవాలను పరిశీలిస్తున్నప్పుడు మలయాళీ నర్సులపై ఎందుకు దృష్టి పెట్టారు?
హాస్పిటల్‌లో కొంతమంది ఆడవాళ్లతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. మా వ్యక్తిగత జీవితం గురించి చర్చించుకున్నాం. కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఇంటి నుండి దూరంగా ఉంటున్న ఈ స్త్రీలకు అనేక మానసిక కల్లోలాలు ఉన్నాయి. సినిమాలోని పాత్రల ద్వారా అనేక సంక్లిష్టతలను, వివిధ స్త్రీల అనుభవాలను అన్వేషించగలనని భావించాను.
రాబిన్, దివ్య, కనీ మీకు ఎలా సహాయపడ్డారు?
వాళ్లు చాలా, చాలా, చాలా సహాయం చేసారు. కేరళలో కూడా అనేక విభిన్న కమ్యూనిటీలు, వివిధ యాసలు, మాండలికాలు, స్వరాలు, ఆహారాలు ఉన్నాయని తెలుసుకున్నాను. నేను ఆంధ్ర ప్రదేశ్‌లో పెరిగాను. చాలా మంది మలయాళీ, తమిళ్ క్లాస్‌మేట్స్ ఉన్నారు. ఎఫ్‌టిఐఐలో కూడా మూడింట ఒక వంతు మంది విద్యార్థులు మలయాళీలు, మూడో వంతు మంది బెంగాలీలు. కాబట్టి అనివార్యంగా ఓనం జరుపుకునేవాళ్లం. మాకు మల్లు క్యాంటీన్ కూడా ఉంది. జాన్ అబ్రహం, ఇతర దర్శకుల చిత్రాలను చూశాము. చాలా మంది టెక్నీషియన్లు మలయాళీలు. ఇలా మంది సహకరించారు.
తన పాత్రలో దివ్య ఎలా నటించింది?
నేను దివ్యను అరియిప్పు (2022)లో చూశాను. ఇందులో ఆమె మరింత పరిణతి చెందిన పాత్రను పోషిస్తోంది. కాబట్టి నేను ఆమెను పెద్ద నర్సు ప్రభగా నటింపజేయాలనుకున్నాను. ఆడిషన్ కోసం ముంబైకి పిలిచాను. ఆమె ఎంతో చురుగ్గా కనిపించింది. ఆమె కంటే అను చిన్నది. కాబట్టి దివ్య ఈ పాత్రకు కచ్చితంగా సరిపోతుందనే నమ్మకం వచ్చింది. వాస్తవానికి ప్రభ, అను ఇద్దరూ కేరళకు చెందినవారు. ప్రభ సంప్రదాయవాదానికి భిన్నంగా అను స్వేచ్ఛగా ఉంటుంది. మలయాళ సినిమాలో సెక్స్, ముద్దులు మనకు చూపించవు. దివ్య ఆ ఇండిస్టీకి చెందినది కాబట్టి ప్రేమ సీన్‌తో ఆమెను కంఫర్టబుల్‌గా మార్చాల్సి వచ్చింది.
దేశంలో మతపరమైన చర్చలు జరుగుతు న్నపుడు మీరు సినిమాలో గణేష్ వేడుకలను చూపించారు. ఎందుకలా..?
ముంబయి ఒకప్పుడు యూనియన్ల, నిరసనల నగరంగా ఉండేది. అదంతా ఇప్పుడు మారిపోయింది. ప్రజలు గుంపులుగా బయటకు వచ్చే ఏకైక సందర్భం మతపరమైన ఊరేగింపు మాత్రమే. చివరకు కాలేజీల్లో కూడా ఇకపై యూనియన్లు ఉండకపోవచ్చు. 80ల తర్వాత ఈ విధమైన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ముంబయి ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. డబ్బు ఇలా మారడానికి కారణమైంది. నన్ను ఇది నిరాశపరిచింది. సినిమాలో నేను బయటకు తీసుకురావాలనుకున్న విషయాలలో ఇది కూడా ఒకటి. చాలా మంది ప్రజలు బయటకు వచ్చి ఆనందించే ప్రదేశమైన గణపతి పండుగతో నేను దీన్ని చేయగలనని భావించాను. నా గత చిత్రంలో కూడా దసరా పండుగను చూపించాను.
కేన్స్ తర్వాత మీరు చర్చనీయాంశంగా ఉండటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది?
నేను చర్చనీయాంశం అవ్వడం ఇష్టం లేదు. కానీ సినిమా జర్నలిస్టులు చాలా సినిమాలను చూస్తారు. కాబట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జర్నలిస్టులు ఈ చిత్రానికి ఎలా స్పందిస్తారో చూడటం నాకు చాలా ఇష్టం.
స్త్రీల ప్రాధాన్యం కలిగిన చిత్రాలు మాత్రమే మీరెందుకు తీస్తారు?
మగ జర్నలిస్టులు నన్ను ‘మహిళలు, స్త్రీల స్నేహం గురించి మాత్రమే మీరు ఎందుకు సినిమా తీశారు?’ అని అడిగారు. దానికి నేను గై రిచీని మీరు వజ్రాల కోసం పోరాడే పురుషులతోనే ఎందుకు సినిమా తీశారు అని అడగరు, అలాంటప్పుడు నన్నెందుకు అడుగుతున్నారు? అని సమాధానం చెప్పాను. మహిళలతో సినిమా తీయడం చాలా ప్రత్యేకం అని జనాలు అనుకుంటున్నారు. కానీ నేను బాధ్యత అనుకుంటున్నాను.