పార్టీలు చూడకుండా అభివృద్ధి చేశాను 

– పార్టీలకతీతంగా ఆశీర్వదించండి
– గుత్ప, నవాబుతో ఎండాకాలం కూడా చెరువులు నింపాను
– ఇందిరమ్మ బిల్లులను గోక్కొని తిన్న పైరవీకారులు
– కుల భవనాల ప్రొసీడింగులు వట్టి కాగితాలు కావు.. గట్టి కాగితాలు
– మీరు మంచి మెజారిటీ ఇస్తే.. కేసీఆర్ నన్ను మంచి స్థానంలో ఉంచుతారు
– వేల్పూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: గ్రామాల్లో అభివృద్ధిని అందించడంలో తాను ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదని, ఇప్పుడు పార్టీలకు అతీతంగా తనను ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని అమీనాపూర్‌, లక్కొరా గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాలేశ్వరం నీటిని పోచంపాడ్‌లో నింపడం ద్వారా గుత్ప, నవాబు ఎత్తిపోతలకు నీటికి కొరత లేకుండా చేశానన్నారు. ఈ ఎత్తిపోతలకు నీటి కొరత లేకుండా పోవడంతో లక్కోరా, అమీనపూర్‌ గ్రామాల్లో చెరువులకు కూడా నీటి ఢోకా లేకుండా పోయిందన్నారు. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా ఏప్రిల్ నెలలో కూడా చెరువులు నింపి పెట్టానన్నారు. కుల సంఘ భవనాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు తెచ్చానన్నారు. ఈ ప్రొసీడింగులకు వట్టి కాగితాలని, దిగజారి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అవి వట్టి కాగితాలు కావు, గట్టి కాగితాలన్నారు. ఈ కుల సంఘ భవనాలు, గృహ లక్ష్మీ ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టుకోవచ్చని, బిల్లులు తప్పకుండా వస్తాయని అందుకు తనదే జిమ్మేదార్‌ అని స్పష్టం చేశారు. మీరు మంచి మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్‌ నన్ను మంచి పొజిషన్‌లో ఉంచుతారన్నారు. తాను మంచి పొజిషన్‌లో ఉంటే మళ్లీ ఎంతో అభివృద్ధిని అందించగలుగుతానన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సగానికి పైగా ఫైరవీకారుల పాలైనవేనని గుర్తు చేశారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే సంక్షేమ పథకాలు నిరంధిగా కొనసాగుతాయన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పింఛన్‌లు, రైతుబంధు ఆపకుండా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఈ ఓట్లు మన అభివృద్దిని, సంక్షేమాన్ని కొనసాగించుకునే ఓట్లు అన్నారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మళ్లీ ఐదేండ్లు సేవలు అందిస్తానన్నారు.