– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. ఆయన బంధువులు కొంత మంది తమ గ్రామంలో ఉన్నారని తెలిపారు. అంతకు మించి అతడితో తనకెలాంటి పరిచయం లేదని పేర్కొన్నారు. కొంత మంది కావాలని తనను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఫిర్యాదు చేసిన చరణ్ చౌదరి, ఎన్‌ఆర్‌ఐ విజరుల మద్య ఉన్న లావాదేవీల్లోకి తనను లాగడం సరికాదన్నారు. చరణ్ చౌదరి బీజేపీలో ఉంటూ భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడుతుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులున్నాయని గుర్తు చేశారు. నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఎలాంటి మచ్చ తనపై పడలేదన్నారు. పార్టీ మారాలంటూ కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. ఓటుకు నోటు కేసు గురించి తనకేమీ తెలియదని ఈ సందర్భంగా ఎర్రబెల్లి తెలిపారు.