కిమామ్‌ పరిమళం వదిలేశాను

కిమామ్‌ పరిమళం వదిలేశానునెమ్మది నెమ్మదిగా అన్నీ వది లేశాను
కోపాన్నీ, వేశాన్నీ ఈర్షనూ, ద్వేషాన్నీ
మంకునూ, పంతాన్నీ అన్నిటినీ వదిలేశాను
మాట మాటకు మా అమ్మ ఉన్నప్పటి అలగడాలను
చిన్న వయసులో పెద్ద హీరోలను కాపీ చేసిన షోకులను
షర్ట్‌ బటన్స్‌ ఓపెన్‌ పెట్టి
ఛాతీ చూపించిన పొగరు దావత్‌లను
ఇలా అన్నీ నఖరాలను వదిలేశాను
కానీ, ఈ మంచితనం వదిలించుకోలేక పోతున్నాను
ఎన్ని దెబ్బలు తగిలినా
ఏ గాయం మానక పోయినా
రాళ్ళు విసరడం ఆపని
మనుషులను ప్రేమించడం
మానుకోలేకపోతున్నాను
జీవితం మీది నమ్మకాన్ని
అమ్మ యిచ్చిన బొమ్మలా
నిద్రలో కూడా వదులుకోలేక పోతున్నాను
విమర్శించే వాళ్ళను కూడా
కౌగిలించుకోకుండా వుండలేక పోతున్నాను
బహుశా… ఈ మనిషితనం, మంచి తనం
రాజా తనం, హైదరాబాదీ తనం
క్షమించే తనం, చేయి వదలని తనం
నాతోనే వుంటాయేమో! అన్నీ వదిలేశాను
మనుషులను చూసి మురిసిపోయే
నా గుణం నన్ను వదలడం లేదు
(జర్దాపాన్‌లో, కిమామ్‌ వేసుకుంటారు. దీనిలో చిత్రమైన నిషా, పువ్వులకు అందని పరిమళం వుంటుంది)
– ఆశారాజు, 9392302245