– దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
ముంబయి : ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీలో ఓ సెలక్టర్ స్థానం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తులు ఆహ్వానించింది. వరుసగా రెండోసారి సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా నియమితులైన చేతన్ శర్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ టెలివిజన్ చానెల్ శూల శోధనలో పిచ్చాపాటి వ్యాఖ్యల ఫలితంగా పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఫిబ్రవరి నుంచి సెలక్షన్ కమిటీలో నలుగురు సభ్యులు మాత్రమే ఉంటున్నారు. నలుగురు సభ్యుల్లో సీనియర్ శివ సుందర్ దాస్ తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుబ్రతో బెనర్జీ, అంకోల, శ్రీధరన్ శరత్ కమిటీలోని ఇతర సభ్యులు. రానున్న ఆసియా కప్, ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో బీసీసీఐ మరో సెలక్టర్ పోస్టు కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కనీసం ఏడు టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు (రంజీ) ఆడిన అనుభవం తప్పనిసరి. లేదా పది వన్డేలు, 20 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం సరిపోతుంది. క్రికెట్‌కు వీడ్కోలు పలికి 5 సంవత్సరాలు ముగిసి ఉండాలి. ఇక క్రికెట్ సంఘాల్లో ఎక్కడా ఏ పదవిలో కొనసాగకూడదు. ఐదేండ్ల పాటు బీసీసీఐ సెలక్టర్‌గా కొనసాగేందుకు అర్హతలు కలిగి ఉండాలని నోటిఫికేషన్‌లో బీసీసీఐ నిబంధనలు పెట్టింది. ఇదిలా ఉండగా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ పదవిపై మాజీ క్రికెటర్లు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం కలిగిన క్రికెటర్లు ఓపెన్ మార్కెట్‌లో రెండు కమర్షియల్ ఈవెంట్లతో కనీసం రూ.1-2 కోట్లు సంపాదిస్తున్నారు. సెలక్టర్‌కు బీసీసీఐ రూ.1 కోటి మాత్రమే చెల్లిస్తుంది. కనీసం రూ.3-5 కోట్ల వేతనం ఉంటే ప్రభావంతమైన మాజీ క్రికెటర్లు సెలక్షన్ కమిటీలో పని చేసేందుకు ముందుకు వచ్చే వీలుంది. విరుద్ధ ప్రయోజనాల నిబంధనతో ఇతర ఆదాయ మార్గాలను సెలక్షన్ కమిటీ సభ్యులు వదులుకోవాల్సి ఉంటుంది. గత కొన్నేండ్లుగా సీనియర్ సెలక్షన్ కమిటీలో పెద్దగా పేరు లేని మాజీ క్రికెటర్లే పని చేస్తుండటానికి తక్కువ వేతనాలే కారణమని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.