– మీ రేవంతన్నగా యువతకు అండగా ఉంటా
– నిరుద్యోగుల తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూడాలి
– ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ
– టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసాం
– కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది
– దారిలేకే కేసీఆర్ నీళ్ల దారి పట్టిండు : కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే పదేండ్లు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని. ప్రజలాశీర్వదిస్తే మరో పదేండ్లుంటా. మీ రేవంతన్నగా యువతకు అండగా ఉంటా. నిరుద్యోగుల తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలని ఉంది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వేసిన చిక్కుముడుల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాం. నల్లగొండ సభలో కేసీఆర్ చెప్పినట్టు పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకోలేదు… కంచరగాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని శాసన సభ ఎన్నికల్లో తెలంగాణ సమాజం తిరస్కరించింది. దీంతో ఏంచేయాలో అర్థంకాక కేసీఆర్ నీళ్ల దారి పట్టిండు ” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ”తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కేసీఆర్ నీళ్లను తన చీకటి మిత్రుడు జగన్‌కు దారాదత్తం చేశారు. తెలంగాణ అభివృద్ది పేరుతో లక్షల కోట్ల అప్పలు చేసి సొంత ఖజానా నింపుకున్నారు. ఇక నియామకాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. యువత ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి నిరుద్యోగులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఆయన అవినీతీ, అక్రమాలు, నియంతృత్వానికి విసిగి పోయిన ప్రజలు శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఇంటికి పంపించి కాంగ్రెస్‌ను గెలిపించారు. అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే 6,956 మంది స్టాఫ్ నర్సులు, 441 మంది సింగరేణి కార్మికులు, నేడు 13,445 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించాం. గురువారం ఇదే స్టేడియంలో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుకు సంబంధించి మరో 2,090కి నియామక పత్రాలను అందజేస్తాం” అని సీఎం వివరించారు. పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేయగా, 2023 అక్టోబర్‌లో తుది జాబితా సిద్ధమైందనీ, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిందన్నారు. గత ప్రభుత్వం న్యాయ వివాదాలు పరిష్కరించడానికి ప్రయత్నించేందుకు గత ప్రభుత్వం చొరవ చూపెట్టక పోవడంతో ఈ నియామక ప్రక్రియ దాదాపు 22 నెలల కొనసాగిందని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబంలో కవిత, వినోద్‌రావులు ఓడిపోతే నెల రోజుల్లో ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి ప్లానింగ్ కమిషన్ చైర్మెన్‌గా అవకాశం కల్పించిన కేసీఆర్, నిరుద్యోగులకు మాత్రం మొండి చేయి చూపించారని అగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో నిరుద్యోగులకు అన్యాయం చేసిందని వ్యాఖ్యానించారు. ప్రశ్నా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించామని అన్నారు. మాపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఏడాదిలోగా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. యువత అధైర్యపడకుండా పోటీ పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. కేఆర్‌ఎంబీపై కేసీఆర్, హరీష్ రావులు పెట్టిన సంతకాలే తెలంగాణ ప్రజలకు మరణ శాపనాలయ్యాయని ఆందోళదన వ్యక్తం చేశారు. చేసిదంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీరివ్వని పరిస్థితి నెలకొందని అన్నారు. కాళేశ్వరం అవినీతి ఎక్కడ బయట పడుతుందోననే భయంతో మాజీ సీఎం కేఆర్‌ఎంబీ వివాదాన్ని భుజానెత్తుకున్నారని విమర్శలు గుప్పించారు. మరోసారి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాననీ చెప్పకుటున్న కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలెందుకు కామారెడ్డిలో ఓడించారని ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలు కడిగుడ్లు, టమాటలతో స్వాగతం పలికినా తీరు మారలేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే శాసససభా పక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా బయట ఎందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చాలనే లక్ష్యంతో తమ సర్కార్ పనిచేస్తున్నదనీ, ఈ యజ్ఞంలో కొత్తగా ఎంపకైన కానిస్టేబుల్ అభ్యర్థులు నిబద్దతతో పని చేయాలని పిలుపు నిచ్చారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని తెలిపారు. గత సర్కార్ చేసిన నిర్వాకాలను సరిదిద్దుకుంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం అప్పులు పాలు చేయడం వల్ల బ్యాంకులతో పాటు ఫైనాన్స్ సంస్థలు సైతం రుణాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బానిస భవన్‌గా మారిన ప్రగతి భవన్‌ను తాము ప్రజాభవన్‌గా మార్చామని చెప్పారు.