కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాను..

నవతెలంగాణ -ఆర్మూర్
నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని గోదావరి సీడ్స్ యజమాని, ఎర్రజొన్నల వ్యాపారి కూనింటి మహిపాల్ రెడ్డి అన్నారు.  మండలంలోని అంకాపూర్ లోని గోదావరి సీడ్స్ కంపెనీలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో గత 33 సంవత్సరాల నుంచి సీడ్స్ వ్యాపారం చేస్తూ రైతులకు సేవ చేస్తున్నానన్నారు. గ్రామాల్లోని రైతులు, ప్రజలతో తనకున్న సంబంధాలతో గత రెండు నెలల నుంచి సర్వే చేసి అందరి అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. రాజీవ్ గాంధీ చేపట్టిన పాదయాత్ర తో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్నారు. హైదరాబాద్ లో తొందరలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతు ధర కల్పించడానికి గాను వరికి రూ. 25, ఎర్రజొన్నలకు రూ. 35 చెల్లిస్తానని వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించింద న్నారు. కాంగ్రెస్ పార్టీ ఎర్రజొన్నలకు రూ.35 చెల్లిస్తే, తాను మరో 5 రూపాయలు కలిపి కిలోకు రూ.40 చెల్లిస్తానన్నాడు. రైతులకు అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు పింఛన్ ఇస్తుందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గ్రామ గ్రామాన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటానన్నారు.