మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను

– జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి పట్టణం లో మంగళవారం గాంధీ గంజ్ లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియామకమైన వ్యవసాయ  మార్కెట్ కమిటీ అధ్యక్షులు ధర్మగొని లక్ష్మీరాజ గౌడ్, వైస్ చైర్మన్ బ్రహ్మానంద రేడ్డి లతోపాటు పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్  షెట్కార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి పదవులు ఇచ్చి గౌరవిస్తాం అని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలోని రైతులకు మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి, రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వ నిధులను మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం , రైతుల రుణమాఫీ ఎన్ని కష్టాలు వచ్చినా అమలు చేసి తీరుతాం, సంక్రాంతి నుండి రైతు భరోసా  అందియ్యబోతున్నాం అన్నారు.
          కేటీఆర్ ముఖ్యమంత్రిని అగౌరపరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబద్దాలతో బదనాం చేయాలనుకుంటున్నాడు అన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు  మాట్లాడుతూ పదవులు అలంకార ప్రాయం కావద్దనీ, రైతుల శ్రేయస్సు కోసం కష్టపడాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారం దిశగా ఎదగాలి, కరీంనగర్ లో ముల్కనూర్ సోసిటీని పాలకవర్గం సందర్శించాలనీ, అక్కడి విధానాలను ఇక్కడ అమలు చేసి ప్రగతి పథంలో ముందుకు సాగాలన్నారు. ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. అబద్దాన్ని వందసార్లు చెప్తే నిజమని నమ్మే ప్రమాదం ఉందన్నారు. నాటి పాలకులు చేసిన 8 లక్షల కోట్ల అప్పు ఫలితంగా నూటికి 10 శాతం వడ్డీ చొప్పున 6500 కోట్లు నెలకు వడ్డీ కడుతున్నాం అని, వెళ్లే ముందు 40 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు.
        దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం, ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నమన్నారు. నాడు దండిగా ఆదాయం ఉండి కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదనీ, ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారన్నారు. నాడు ప్రగతి భవన్ వెళ్ళడానికి వెళ్తే గేట్లు బంద్ చేసేవారు. మహాత్ముల విగ్రహాలను పెట్టడం గొప్ప కాదు.. వాళ్ళను గౌరవించుకోవడం గొప్ప, అంబెడ్కర్ కు ఒక్కరోజైనా దండ వేయలేదన్నారు. కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించి టూరిజంగా మార్చేలా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ ర్సన్ గడ్డం ఎందుకు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, నాయకులు గోనే శ్రీనివాస్, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.