జైస్వాల్‌కు ఐసీసీ అవార్డు

జైస్వాల్‌కు ఐసీసీ అవార్డు– ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ సొంతం
దుబాయ్ : భారత బ్యాటింగ్‌ యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు ద్వి శతకాలు సహా 712 పరుగులు సాధించిన యశస్వి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ (ఫిబ్రవరి)గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన యశస్వి.. విశాఖపట్నం, రాజ్‌కోట్‌ టెస్టుల్లో ద్వి శతకాలు బాదాడు. ‘ఐసీసీ అవార్డు దక్కటం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సాధిస్తానని ఆశిస్తున్నాను. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఆస్వాదించాను. రాజ్‌కోట్‌లో ద్వి శతక సంబురాలు చేసుకున్నప్పుడు జీవితంలో ఉత్తమ క్షణాలను అనుభవించాను’ అని యశస్వి జైస్వాల్‌ అన్నాడు. 22 ఏండ్ల వయసులోనే రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన జాబితాలో సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌, వినోద్‌ కాంబ్లి సరసన నిలిపింది. న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌, పథుమ్‌ నిశాంక (శ్రీలంక)లను వెనక్కి నెట్టి ఈ అవార్డును జైస్వాల్‌ గెల్చుకున్నాడు.