ఇచ్చంత్రాల పచ్చిపులుసుకు…..

కొన్ని సామెతలు దీర్ఘం తీసినట్టు ఉంటయి. వ్యంగ్యంగా చెప్పేందుకు లేదా దెప్పి పొడిచేందుకు మాటకారులు ఇసొంటి సామెతలు ఉపయోగిస్తారు. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు బంధువులు ఒకరింటికి ఒకరు భోజనానికి పిలుచుకోవడం మామూలు విషయమే. చుట్టం వస్తే కోడికూర వండడం ఎవరికైనా ఒక గౌరవం. కొందరి ఇంటికి పోతే అలాంటిదేమీ ఉండదు. పిసినాసి తనం తీవ్రంగా ఉంటది. అట్లాంటి సందర్భంలో ‘ఇచ్ఛంత్రాల పచ్చిపులుసుకు ఇద్దరిని రమ్మంటే ముగ్గురు వచ్చిండ్రు, ముగ్గురి ఎనుక ముసలోడు దేకుకుంట వచ్చిండట’ ఈ సామెత గుర్తొస్తది. అసలే అది పిసినారి ఇల్లు. భోజనానికి పిలిచారని పోతే అక్కడ పచ్చి పులుసు. అంటే చింతపండుతో చేసిన పలుచటి చారు అన్నట్టు. ఇట్లా పోయినోళ్ళు ‘పచ్చి పులుసు కన్న పలచన అయిపోతారు’. ఆ పిలిచిన ఆమె ఎట్లాగూ ‘ఆకుకు అందది పోకకు పొందది’ అన్నట్లు చాలు బాజీ తనము మనిషి. అసలు ఇద్దరిని పిలిస్తే ముగ్గురు పోవుడే తప్పు. అట్లనే మరొకటి ‘ఆకు పోయి బాయల పడితే ఎంకులాడేతందుకు ఏడుగురు పోయిండ్రట’. చెట్టు మీది నుంచి ఒకటే ఆకు రాలింది. ఎంతమంది వెతుకుతున్నరో చూడు. ఇట్లాంటి సందర్భంలోనే సామెతలు బహు సుందరంగా పుట్టించే వాళ్ళు ఉంటారు. వాళ్లే ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం’ మనుషులు. లోకంలో జర ఉషారు ఉన్నోళ్లదే పోకడ. వాళ్లు ఎంత ఫాస్ట్‌ అంటే ‘సు అంటే సుక్కల పాపయ్య దగ్గరికి పోయి వస్తరు’ అన్నట్టు. ..
– అన్నవరం దేవేందర్‌, 9440763479