న్యూఢిల్లీ : దేశంలోనే రెండో అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 14.8 శాతం వృద్ధితో రూ.11,792 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.10,272 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.18,678 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో 9.1 శాతం వృద్ధితో రూ.20,370.6 కోట్లకు చేరింది. ఏడాదికేడాదితో పోల్చితే 2024 డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 14.1 శాతం పెరిగి రూ.15,20,309 కోట్లుగా చోటు చేసుకున్నాయి. కరెంట్ ఎకౌంట్ డిపాజిట్లు 13.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. నికర దేశీయ అడ్వాన్సులు 15.1 శాతం పెరిగాయని ఆ సంస్థ తెలిపింది. బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 1.96 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం సెప్టెంబర్ త్రైమాసికంలో జీఎన్‌పీఏ 1.97 శాతంగా చోటు చేసుకుంది.
బీఓఐ ఫలితాలు ఆకర్షణీయం
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఆకర్షణీయ ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. 2024-25 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 35 శాతం వృద్ధితో రూ.2,517 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.1,870 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ3లో బీఓఐ నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.6,070 కోట్లకు చేరింది. నికర మొండి బాకీలు1.41 శాతం నుంచి 0.85 శాతానికి తగ్గాయి. సూల ఎన్పీఏలు 5.35 శాతం నుంచి 3.69 శాతానికి పరిమితమయ్యాయి.
తగ్గిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లాభాలు..
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ప్రయివేటు రంగంలోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లాభాలు 53 శాతం తగ్గి రూ.339 కోట్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.716 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 14 శాతం పెరిగి రూ.4,902 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 1.94 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలానికి 2.04 శాతం జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. ఇదే సమయంలో 0.68 శాతంగా నికర నిరర్ధక ఆస్తులు.. గడిచిన క్యూ33 ముగింపు నాటికి 0.52 శాతానికి తగ్గాయి.
యెస్ బ్యాంక్ లాభాలు మూడు రెట్లు..
ప్రయివేటు రంగంలో యెస్ బ్యాంక్ నికర లాభాలు మూడు రెట్లు పెరిగాయి. 2024-25 డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో రూ.612 కోట్ల నికర లాభాలు సాధించింది. మొండి బాకీలు తగ్గడంతో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. 2023-24 ఇదే క్యూ3లో రూ.231 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.8,179 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో రూ.9,341 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 2 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గగా.. నికర ఎన్పీఏలు 0.9 శాతం నుంచి 0.5 శాతానికి పరిమితమయ్యాయి.