
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ యాదగిరి అని, ఆయనకు విప్లవ ఉద్యమ నిర్మాణంతో నివాళులర్పిద్దామని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా అధ్యక్షులు సారా సురేష్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ బి.అశోక్ అధ్యక్షతన కామ్రేడ్ యాదిగిరి సంస్మరణ సభను నిర్వహించారు. సభలో వక్తలు జిల్లా నాయకులు సారా సురేష్, హసకొత్తూర్ మాజీ ఎంపీటీసీ జి. సత్యనారాయణ మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టుగా కామ్రేడ్ యాదిగిరి ఐదు దశాబ్దాల కాలంగా అనేక కష్టనష్టాలకు, నిర్బంధాలను ఎదుర్కొని విప్లవోద్యమ నిర్మించాడని కొనియాడారు. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో విప్లవ పార్టీలో తన కార్యక్రమాల్ని ప్రారంభించి, తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన కామ్రేడ్ యాదగిరి త్యాగధనుడన్నారు.సమాజం మార్పులోనే తమ కుటుంబం కూడా భాగమని భావించి, అత్యవసర కాలంలో అజ్ఞాతవాసంలోకి వెళ్లి, గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షను రూపుమాపడానికి, రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమించాడని గుర్తు చేసుకున్నారు. జిల్లాలో నిజాంసాగర్ ఆయకట్టు రక్షణ కొరకు రైతు ఐక్య ఉద్యమాలు నిర్మించి, సింగూర్ నిర్మాణానికి తన వంతు పాత్ర పోషించాడని గుర్తు చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూముల సమస్యను, ఆనాటి సాగు చేస్తున్న వారందరికి వేలాది ఎకరాల భూముల్ని ప్రభుత్వం పట్టాలు ఇచ్చే విధంగా ఉద్యమాన్ని నడిపాడన్నారు. అటవీ శాఖ అధికారుల దౌర్జినానికి వ్యతిరేకంగా, మేకపుల్లరి రద్దు కోసం జిల్లా వ్యాప్త ఉద్యమాలు నిర్మించాడని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి, పసుపు బోర్డు సాధన కొరకు రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు నిర్మించాడని గుర్తు చేశారు. కామ్రేడ్ యాదిగిరిని గుర్తు చేసుకోవడం అంటే… విప్లవ ఉద్యమాన్ని నిర్మించి తన ఆశయాన్ని ముందు తీసుకుపోవడమే నిజమైన నివాళి అన్నారు. ఈ నేపథ్యంలో మనమందరం ముందుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి. కిషన్, వి.సత్యక్క, ఉట్నూరి బాలయ్య, బాలకిషన్, వి. ఆనంద్, సారా లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.