కేరళ సుపంపన్నమైన భవిష్యత్తు కై 22 ప్రాధాన్యతా రంగాల గుర్తింపు

కేరళ సుపంపన్నమైన భవిష్యత్తు కై
22 ప్రాధాన్యతా రంగాల గుర్తింపు– ముఖ్యమంత్రి విజయన్‌ వెల్లడి
కోచి : కేరళ రాష్ట్రానికి సుస్థిరమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం 22 ప్రాధాన్యతా రంగాలను గుర్తించిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శుక్రవారం తెలిపారు. కేరళకు గల అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు కేరళ పారిశ్రామిక సహకార సంస్థతో కలిసి ఫిక్కి ఏర్పాటు చేసిన రెండు రోజుల సమావేశం రెండవ రోజు ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.
పెట్టుబడులను ఆకర్షించి, ఆర్థికాభివృద్ధిని పెంపొందించేం దుకు సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రాముఖ్యతను గుర్తిస్తూ, అనేక చొరవలను తాము తీసుకున్నామని అవే ఈనాడు కేరళను వ్యాపారాల ఆవిష్కరణకు, అభివృద్ధికి కేంద్రంగా నిలబెట్టాయని విజయన్‌ చెప్పారు.
‘ఇందుకు సంబంధించి మన కీలకమైన లక్ష్యాల్లో ఒకటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ కె-స్విఫ్ట్‌ (సింగిల్‌ విండో క్లియరెన్స్‌ మెకానిజం)ను ప్రవేశపెట్టడం. ఈ వినూత్నమైన వేదిక వివిధ విభాగాలను, సంస్థలను సమన్వయం చేసి, వివిధ ప్రక్రియలను వేగవంతం చేస్తుంది, ఇన్వెస్టర్లకు అనవసరమైన పాలనా యంత్రాంగ అడ్డంకులను తొలగిస్తుంది. ప్రస్తుతం, కేరళ రాష్ట్రం మరింత సులభంగా వ్యాపారం చేసుకోవడాన్ని పెంపొందించడం కోసం జాతీయ ఏక గవాక్ష వ్యవస్థతో కె-స్విఫ్ట్‌ను సమ్మిళితం చేసే దిశగా మేం పనిచేస్తున్నాం” అని విజయన్‌ పేర్కొన్నారు.
సులభంగా వ్యాపారం చేసుకోవడానికి, పారదర్శకత, జవాబుదారీతనానికి హామీ కల్పించడానికి కె-స్విఫ్ట్‌కు సంబంధించి గణనీయమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. కేరళ కేంద్ర తనిఖీ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా మాన్యువల్‌గా జరిగే వాటిని మార్చామని, దీనివల్ల జరగాల్సిన క్రమం మరింత క్రమబద్ధీకరణ అవడమే గాకుండా పారదర్శకత పెరుగుతుందని, అవినీతికి తావు లేకుండా వుంటుందని విజయన్‌ చెప్పారు.