లాలాజలంతోనే జన్యుపర వ్యాధుల గుర్తింపు

– భారత్‌లో లార్డ్స్‌ మార్క్‌ జీనోమ్‌ టెస్టింగ్‌
హైదరాబాద్‌ : లాలాజలంతోనే జన్యుపరమైన వ్యాధుల గుర్తింపునకు వీలుగా లార్డ్స్‌ మార్క్‌ ఇండిస్టీస్‌ సబ్సీడరీ సంస్థ భారత్‌లో లార్డ్స్‌ మార్క్‌ మైక్రో బయోటెక్‌ సంస్థ జినోమ్‌ టెస్టింగ్‌ను ప్రారంభించింది. బుధవారం హైదరాబాద్‌లో లార్డ్స్‌ మార్క్‌ ఇండిస్టీస్‌ ఫౌండర్‌ సచిదనాంద్‌ ఉపద్యారు, లార్డ్స్‌ మార్క్‌ మైక్రోబయోటెక్‌ సిఇఒ సుబోద్‌ గుప్తా మీడియాతో మాట్లాడారు. లాలాజలంతోనే జన్యుపరంగా సంక్రమించే వ్యాధులను జీనోమ్‌ టెస్టింగ్‌లో గుర్తించవచ్చన్నారు. దీనిలో 99 శాతం ఖచ్చితత్వంతో ఫలితాలు ఉంటాయన్నారు. ఈ టెస్టింగ్‌ కిట్‌ విలువ రూ.8,000 నుంచి రూ.16,000 మధ్య ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎనిమిది రకాల టెస్ట్‌లను చేస్తున్నామన్నారు. తొలి దశలో రూ.20 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.100 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లాలాజల ఆధారిత పరీక్షకు రక్తం లేదా ప్లెబోటోమిస్ట్‌ వెలికితీత అవసరం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లోనూ ఈ సేవలు లభ్యమవుతాయన్నారు. ఏడాదికి 50 వేల నుంచి ఒక లక్ష పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీనోమ్‌ టెస్టింగ్‌ కిట్‌లను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయవచ్చన్నారు. ఈ పరీక్షల్లో ఒక వ్యక్తి యొక్క జన్యుపరమైన ప్రమాదాన్ని (ప్రిడిస్పోజిషన్‌) ఒక లక్షణం లేదా పరిస్థితి పరంగా అంచనా వేయవచ్చన్నారు. క్యాన్సర్‌, హృదయ సంబంధ రుగ్మతలు, మధుమేహం లేదా వంశపారంపర్య స్థితి వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించవచ్చన్నారు. దేశవ్యాప్తంగా 48 నగరాల్లో జీనోమ్‌ టెస్టింగ్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలుత మెట్రో, టైర్‌ 1 నగరాల్లో తదుపరి 3-4 సంవత్సరాలలో ద్వితీయ, తృతీయ శ్రేణీ పట్టణాలపై దృష్టి సారించనున్నామన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ సీనియర్‌ జెనిటిక్‌ కన్సల్టెంట్‌ జైనాబ్‌ అబ్బాస్‌ పాల్గొన్నారు.