
నవతెలంగాణ – తాడ్వాయి
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల మార్చి11వ తేదీ సోమవారం నుండి కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) 2024 అనే కార్యక్రమంలో భాగంగా ఆశా, ఏఎన్ఎం, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్(డిపిఎం) సంజీవరావు ఆధ్వర్యంలో కాటాపూర్ పిహెచ్సీ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఎం సంజీవరావు మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం ఈనెల మార్చి 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు, 14 రోజులపాటు ఈ కార్యక్రమం నిరంతరంగా నిర్వహించబడుతుందన్నారు. ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలోని ఇళ్ల నన్నిటిని, ప్రతిరోజు 20 ఇండ్లు తగ్గకుండా సంపూర్ణంగా సర్వే చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపల ఈ సర్వే నిర్వహించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకొని వారికి మనం వచ్చిన ఉద్దేశాన్ని తెలియజేసి ఎవరికైనా అనుమానిత మచ్చలు శరీరంపై ఉంటే చెప్పాలని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. కోరి ప్రతి ఒక్కరిని భౌతికంగా, శ్రద్ధగా పరిశీలించాలని సూచించారు. అనుమానం ఉన్న వారిని నిర్ణీత ఫారంలో నమోదు చేసుకోవాలని, గతంలో కుష్టు వ్యాధికి మందులు వాడిన వారిని అనుమానితుల లిస్టులో రాయరాదన్నారు. సర్వే చేసిన ప్రతి ఇంటికి సంబంధించిన సమాచారాన్ని నిర్దేశించిన ఫారంలో క్రమబద్ధతిలో వ్రాసుకోవాలని, ఆ తర్వాత ఆ ఇంటిలోని వారిని పరీక్షించిన తర్వాత ఆ ఇంటి పై చాక్పీస్ తో మీ టీమ్ నెంబరు వేయాలన్నారు. ఆ తర్వాత ఏ ఇంటికి వెళుతున్నామో ఆ ఇంటి వైపు బాణం గుర్తు వేయాలని, ప్రతిరోజు 20 నుంచి 30 గృహాలను సందర్శించి అందరినీ పరిశీలించి ఉదయం 9 గంటల వరకు మీ ఏరియా కు సంబంధించిన ఆరోగ్య కార్యకర్తకు ఆరోజు ఎన్ని గృహాలను సందర్శించారు? ఎంతమందిని పరిశీలించారు? ఎంతమంది అనుమానితులను గుర్తించారు అనే విషయం తెలియచేసి, అనుమానితులకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రతి సబ్ సెంటర్ కు సంబంధించిన ఆరోగ్య కార్యకర్త మరియు సూపర్వైజర్ ఈ సర్వే కార్యక్రమాన్ని స్వయంగా పాల్గొని పర్యవేక్షించాలని సూచించారు.సర్వే రిపోర్ట్ ను ఉదయం 11 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లకు తెలియజేయాలని పేర్కొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ డిపిఎంఓ లకు తెలియజేసి, వారి ద్వారా లెప్రసీ కేసులను గుర్తించాలని కోరారు. ముందుగా అన్ని గ్రామాలలో చాటింపు ద్వారా అవేర్నెస్ కల్పించాలన్నారు. శనివారం వరకు అవగాహన కల్పించి సోమవారం నుండి కుష్టు రోగుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రజిత హెచ్ ఈఓ సమ్మయ్య, ఏఎన్ఎంలు రాజేశ్వరి, గంగమ్మ, చంద్రకళ, పుష్పలత, ఎల్లారమ్మ ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.