అటవీశాఖ సిబ్బంది సేవలను గుర్తించండి

– ప్రెసిడెన్షిల్‌ గ్యాలంట్రీ, ఇతర అవార్డులివ్వండి : కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌కు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా అటవీ సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతిఏటా ప్రెసిడెన్షియల్‌ గ్యాలంట్రీ అవార్డులతో, ఇతర అవార్డులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. బుధవారం ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు ఆమె లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట కూడా అవార్డుల అంశాన్ని ప్రతిపాదించారు. ‘ఆలిండియా రేంజ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌’ విన్నపాన్ని తెలుపుతూ అటవీ అధికారులకు ఈ అవార్డును అందించాల్సిన అవసరాన్ని లేఖలో వివరించారు. అవార్డుల అందజేత ద్వారా వారిలో నైతిక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఇతర యూనిఫామ్‌ సర్వీసు ఉద్యోగులతో సమానంగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పోలీసులకు రాష్ట్రస్థాయిలో ”పోలీస్‌ సేవా పతకాలు” అందిస్తున్నట్టుగానే ”అటవీ సేవా పతకాలు” అందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి విన్నవించారు.
అటవీ, వన్యప్రాణులు సంరక్షణలో ఉత్తమ సేవలందించే వారికి ఇంతకు పూర్వం అందించిన ”వన సంరక్షణ సేవా పతకాలు” తిరిగి పునరుద్ధరించాలని కోరారు. వీటితో పాటు అడవులు సంరక్షణ, అభివృద్ధి కోసం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ”చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు” ను అందజేయాలని విన్నవించారు. అటవీ అధికారులకు గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు ప్రతి ఏటా జనవరి ఒకటి వంటి ప్రత్యేక రోజుల్లో అవార్డులిచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.