ఆశాలకు పండుగ పూట జీతాలు ఇవ్వకుంటే విధులను బహిష్కరిస్తాం

If Ashas are not paid during the festival, we will boycott the duties– బతుకమ్మ దసరా పండగ సందర్భంగా మహిళా కార్మికులకు వేతనాలు ఇవ్వరా
– ఆశాలకు సెప్టెంబర్ నెల పారితోషికాలు, లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు తక్షణమే చెల్లించండి 
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్ 
ఆశాలకు పండుగ పూట జీతాలు ఇవ్వకుంటే విధులను బహిష్కరిస్తాం అని, బతుకమ్మ దసరా పండగ సందర్భంగా మహిళా కార్మికులకు వేతనాలు ఇవ్వరా అని, ఆశాలకు సెప్టెంబర్ నెల పారితోషికాలు, లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు తక్షణమే చెల్లించాలని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..గత రెండు నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ప్రతినెలా పారితోషికాలను నెల చివరి తేదీన చెల్లించింది. ఇదే పద్ధతిలో సెప్టెంబర్ నెల పారితోషికాలు కూడా సెప్టెంబర్ నెల చివరి తేదీన అకౌంట్లో పడతాయని ఆశాలు ఆశించారు. కానీ సెప్టెంబర్ నెల చివరి తేదీ దాటి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ పారితోషీకాలు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. పైగా మహిళలు, పురుషులు మొత్తం కుటుంబ సభ్యులు అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా ముఖ్యమైన పండుగలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పారితోషికాలు సకాలంలో రాకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా అనేక ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు కొనుక్కోవాలి, రకరకాల వంటలు చేసుకోవాలి.  ఇంకా తదితర అనేక ఖర్చులు ఉంటాయి. ఈ పండుగల సందర్భంగా ఆశాలపైన ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని ఆశాలు విజ్ఞప్తి చేస్తున్నారు. సెప్టెంబర్ నెల పారితోషికాలతో పాటు 2023, 2024 రెండు సంవత్సరాల లెప్రసీ సర్వే, 2024లో చేసిన పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు మొత్తం చెల్లించి ఆశాలను రాష్ట్ర ప్రభుత్వం పండుగల సందర్భంగా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పై సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రేణుక, సుకన్య, స్వప్న, లలిత, శోభ, తదితరులు పాల్గొన్నారు.