మళ్లీ బీజేపీ వస్తే.. వందేండ్లు వెనక్కే..

If BJP comes again.. Hundred years ago..– హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులన్నీ గుజరాత్‌కే..
– రిజర్వేషన్లు రద్దు
– కారు షెడ్‌కి పోలే.. తూకానికి పోయింది
– అందుకే కేసీఆర్‌ బస్సుయాత్ర చేసిండు
– హైదరాబాద్‌లో మతకల్లోలాలకు బీజేపీ యత్నం
– జేపీ దర్గా సాక్షిగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం..
– పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం : మక్తల్‌, షాద్‌నగర్‌, గోషామహల్‌ సభల్లో సీఎం రేవంత్‌
నవతెలంగాణ- మక్తల్‌, షాద్‌నగర్‌, హైదరాబాద్‌
‘బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్‌లు ఉండవు. మరో వందేండ్లు వెనక్కు పోతాం. దేశంలో పెట్టుబడులు రావు.. అభివృద్ధి ఉండదు. హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులు గుజరాత్‌కు తరలించుకుపోవాలనే కుట్ర జరుగుతుంది. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడమే వారి పని. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. షెడ్డుకు పోయిన కారు ఇక తిరిగి రాదని వ్యాఖ్యానించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని మక్తల్‌, షాద్‌నగర్‌, హైదరాబాద్‌లోని గోషామహల్‌ ప్రాంతాల్లో జరిగిన సభల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో అరుణమ్మ గెలిస్తే మళ్లీ మాఫియా రాజ్యం వస్తుందని, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వంశీచందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించా లని మక్తల్‌ సభలో పిలుపునిచ్చారు. గత ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడా ఉందన్నారు. తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించుకుని రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, జలంధర్‌రెడ్డి, బాలకిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలంటే ఇండియా కూటమి కేంద్రం లో అధికారంలోకి రావాలని షాద్‌నగర్‌ సభలో రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షోలో సీఎం మాట్లాడుతూ.. మోడీ పాలమూరు జిల్లాకు వచ్చి.. వారు ఏమి చేశారో చెప్పకుండా డీకే.అరుణను గెలిపించాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు. అరుణను గెలిపిస్తే బంగ్లాకే పరిమితం అవుతారని, వంశీ చందర్‌రెడ్డిని ఢిల్లీకి పంపిస్తే మనకోసం సైనికుల్లా పోరాడి మన ప్రాంత అభివృద్ధికి పాటుపడతాడని అన్నారు. బీజేపీ హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి శాంతి భద్రతలను భగం చేసే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జేపీ దర్గా సాక్షిగా.. షాద్‌నగర్‌ నియోజకవర్గ ప్రజల సాక్షిగా ఆగస్టు 15వ తేదీ లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌ కారు షెడ్డుకుపోయిందని భ్రమలో ఉన్నారని, నిజానికి కారు తూకానికే పోయిందని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేశారని విమర్శించారు. షాద్‌నగర్‌ నియోజక వర్గ అభివృద్ధికి తాను అండగా ఉంటానని, రోడ్లు, కాలేజీలు, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని, షాద్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీలు వెంకట్‌ రాంరెడ్డి, తాండ్ర విశాల శ్రవణ్‌రెడ్డి, ఎంపీపీ ప్రియాంక, నాయకులు కాశినాథ్‌రెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, మామిడి శ్యామ్‌ సుందర్‌రెడ్డి, విశ్వం, బాబర్‌ ఖాన్‌, రఘు, జమృత్‌ఖాన్‌, కొంకళ్ల చెన్నయ్య, శ్రీకాంత్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్‌, పురుషోత్తంరెడ్డి, జితేందర్‌రెడ్డి, ఖదీర్‌, అందే మోహన్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజు, ఈశ్వర్‌ నాయక్‌, శ్రీనునాయక్‌ పాల్గొన్నారు.