బీజేపీ నోరు తెరిస్తే అబద్ధాలే

If BJP opens its mouth, it will be lies– రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌నే గెలిపించాలి
– పునర్విభజన చట్టంలోని ఏ ప్రాజెక్టునూ కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదు
– సింగరేణిని ప్రయివేటీకరిస్తున్నా.. బీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేకపోయింది
– చేనేత బకాయిలు తప్పకుండా చెల్లిస్తాం..
– గతిలేక ఇప్పుడు ప్రజలు తిరస్కరించిన కొప్పులను నిలబెట్టింది
– కరీంనగర్‌లో అపరమేధావి వినోద్‌ కుమార్‌ , అరగుండు సంజరుని ఓడించాలి
–  బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య రహస్య ఒప్పందాన్ని గుర్తెరగాలి ధర్మపురి, సిరిసిల్ల, మేడ్చల్‌ కాంగ్రెస్‌ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
బీజేపీ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. దాని వాట్సాప్‌ యూనివర్సిటీలో చెప్పే మాటలన్నీ బూటకమే. ప్రజలను ఏమార్చి మత రాజకీయాలు చేస్తూ మెజార్టీవర్గం ఓట్లు దండుకుంటోంది. మెల్లిగా మనువాదాన్ని రాజ్యాంగం స్థానంలో తీసుకొచ్చే కుట్ర చేస్తోంది.. ఈ పదేండ్లలో ఏనాడూ జనాభా లెక్కలు తీయకుండా, కులగణన చేయకుండా దళిత, గిరిజన, బలహీనవర్గాల రిజర్వేషన్లను ఎత్తేసే కుట్రకు తెరలేపింది. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు కేంద్రంలో 400 సీట్లు కావాలని అడుగుతోంది.. పొరపాటున మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే బలహీనవర్గాల రిజర్వేషన్లన్నీ తొలగిస్తుంది.. ఈ ఎన్నికల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ధర్మపురి, కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని సిరిసిల్ల, మల్కాజిగిరి పరిధిలోని ఉప్పల్‌లో నిర్వహించిన జనజాతర సభల్లో సీఎం ప్రసంగించారు.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / వెల్గటూర్‌ / సిరిసిల్ల
దేశాన్ని 60ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ హయాంలోనే ఎప్పటికప్పుడూ జనాభా లెక్కలు, కులగణన చేస్తూ రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలకు సమన్యాయం అందించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ ఫలితంగానే నేడు దళిత, గిరిజన, బలహీనవర్గాల వారు విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించగ లుగుతున్నారని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం బలహీనవర్గాలకూ 25శాతం రిజర్వేష న్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఈ రోజు గడ్డం కాకా, వివేక్‌, లక్ష్మణ్‌కుమార్‌, సీతక్క ఇలా చెప్పుకుంటూ పోతే వెనుకబడిన తరగతుల నుంచి ఎంతో మంది రాజకీయాల్లో మంత్రుల స్థాయి వరకూ ఎదిగారన్నారు.
కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన బీజేపీ తమ మనువాదాన్ని తీసుకొచ్చే కుట్ర చేస్తోందన్నారు. అలా 8 రాష్ట్రాల్లో అడ్డదారుల్లోకి అధికారంలోకి కూడా వచ్చిందన్నారు. రాష్ట్రాల్లో రిజర్వేషన్ల రద్దుపై తీర్మానం చేయించి 400సీట్లు వచ్చాక లోక్‌సభలోనూ ఎత్తివేయాలనే కుట్రకు తెరతీసిందన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్‌, వరంగల్‌ రైల్వేకోచ్‌, గిరిజన యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎంలను కాంగ్రెస్‌ మంజూరు చేసినా.. మోడీ ఏ ఒక్కటీ ఇవ్వలేదన్నారు. గుజరాత్‌కు తప్ప తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని, ఆ పార్టీకి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు.
ఎన్నికల కోడ్‌ ముగియగానే బకాయిలు చెల్లిస్తాం..
‘మొన్నటి వరకు ఉన్న ఉద్దెరోడు రాష్ట్రానికి రూ.40వేల కోట్ల బకాయిలు పెట్టి పోయిండు. సిరిసిల్ల చేనేతలకు రూ.270కోట్లు ఉద్దెర పెట్టాడు. మా ప్రభుత్వం ఇప్పుడు వెంటనే రూ.50కోట్లు చేనేతలకు విడుదల చేస్తుంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే మిగతా బకాయిలు చెల్లిస్తాం’ అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు అన్నీ ఉన్నా.. అల్లుని నోట్లో శని అన్నట్టుగా.. ఈ ప్రాంత అల్లుడిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ పదేండ్లలో రూ.20లక్షలు ఖర్చు చేసి, రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఈ ప్రాంత నిర్వాసితులకు చేసిందేమీ లేదన్నారు.
రిజర్వేషన్లపై కేటీఆర్‌ మాట్లాడరేమీ..
కోనసీమ నుంచి చిత్రసీమ వరకు మాట్లాడే ట్విట్టర్‌ టిల్లు కేటీఆర్‌ ఇవ్వాల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కరీంనగర్‌లో అపరమేధావి వినోద్‌కూమార్‌, అరగుండు బండి సంజరుకి ఓటుతో బుద్ధి చెప్పి కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాలను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పెద్దపల్లిలో ధర్మపురి ప్రజలు తిరస్కరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బీఆర్‌ఎస్‌ గతిలేక బరిలో దింపిందన్నారు. ఆయన వ్యవహారం అందిరకీ తెలిసిందేనని, 2014 ఎన్నికల్లో లక్ష్మణ్‌కుమార్‌ గెలిచిన్పటికీ కలెక్టర్‌ కాళ్లు పట్టుకుని స్వల్పమెజార్టీ చూపించి గెలిచారని ఆరోపించారు. సింగరేణిని బీజేపీ ప్రయివేటుపరం చేస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు చూస్తూ ఉండిపోయారే తప్ప ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రతి అంశానికీ సానుకూలంగా స్పందించిన ఆయన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30వేల ఓట్ల మెజార్టీకి తగ్గకుండా గడ్డం వంశీకి 2లక్షల మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఈ రెండు సభల్లో కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వివేక్‌, వినోద్‌, రాజ్‌ఠాకూర్‌, విజయ రమణారావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ అభ్యర్థులు గడ్డం వంశీ, వెలిచాల రాజేందర్‌రావు పాల్గొన్నారు.
ఆలస్యంగా సభలకొచ్చిన సీఎం..
ధర్మపురిలో మధ్యాహ్నం 2గంటలకు, సిరిసిల్లలో సాయంత్రం 4గంటలకు కాంగ్రెస్‌ జనజాతర జరగాల్సి ఉండగా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆ పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ నామినేషన్‌ కోసం రారుబరేలికి వెళ్లారు. అక్కడి నుంచి హుటాహుటిన వచ్చి తొలుత ధర్మపురి సభకు రాత్రి 7గంటలకు చేరుకున్నారు. అక్కడే గంటపాటు సభలో పాల్గొని తిరిగి సిరిసిల్లకు రోడ్డు మార్గంలో బయల్దేరి 9గంటలకు చేరుకున్నారు. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నమే పార్టీ శ్రేణులు జనసమీకరణ చేయగా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూశారు. హాజరైన వారిలో చాలామంది ఇండ్లకు వెళ్లిపోయారు.