మళ్లీ బీజేపీ గెలిస్తే ఎన్నికలుండవు : రాజేశ్వర్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మళ్లీ బీజేపీ గెలిస్తే దేశంలో ఇవే చివరి ఎన్నికలవుతాయని కాంగ్రెస్‌ ఎన్నారై నాయకులు రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను గెలిపించి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, సెక్యులరిజాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ గంపా వేణుగోపాల్‌ మాట్లాడుతూ పదేండ్ల పాటు కేసీఆర్‌ రుణమాఫీ చేయకపోవడంతో విదేశాల్లో ఉన్న రైతుల సిబిల్‌ స్కోర్‌ తగ్గిందని తెలిపారు. దీంతో ఎన్నారై పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వారి సిబిల్‌ స్కోర్‌ పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎన్నారై కన్వీనర్‌ భీమ్‌ రెడ్డి గల్ఫ్‌ కార్మికులకు, ఎన్నారైలకు బీజేపీ ఏం చేయలేదని విమర్శించారు. కరోనా సమయంలోనూ వందే భారత్‌ విమానాల్లో రెట్టుంపు సొమ్మును వసూలు చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.