– ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మింది
– ఏమీ చేయని మోడీ దేవుడు ఎలా అవుతారు
– రాష్ట్ర సర్కారును కూలగొట్టే కర్మ మాకు లేదు
– ఎన్నికలు ముగియగానే పెనుమార్పులు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– ఆదిలాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరేయాలని పిలుపు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
”దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ ఎంపీలు, ఇతర కీలక నాయకులు తాము మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్నారు. బీజేపీ ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మింది. దీన్ని బట్టి బీజేపీ మరోసారి గెలిస్తే దేశంలో రిజర్వేషన్లు అనేవి ఉండకుండా పోతాయి” అని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. బీజేపీ నేత బండి సంజరు మోడీ దేవుడని చెబుతున్నారు… ఆయన్ను దేవుడు అని ఎందుకు అనాలి..? అని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించలేదని, ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వేలైన్ నిర్మాణం చేపట్టడం లేదని, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదని ఇలాంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలని అన్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతాయని, జనాభా ప్రాతిపదికన చేపట్టే ఈ విభజన కారణంగా రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రాష్ట్రంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేననే విషయం గుర్తించుకోవాలని సూచించారు. సీఎం జేబులో కత్తి పెట్టుకొని తిరుగుతున్నానని.. పేగులు మెడలో వేసుకుంటానని, మానవ బాంబులుగా మారుతామని అంటున్నారని, సీఎం లాంటి వ్యక్తులు మాట్లాడే భాషేనా ఇది అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారును కూలగొట్టే కర్మ మాకు పట్టలేదని, రాబోయే ఐదేండ్లు నడపండి.. 420హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే.. బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. పదేండ్లలో చేసిన అభివృద్ధి పనులను మనం చెప్పుకోలేకనే ఓటమి చెందామని గుర్తుచేశారు. 2లక్షల ఉద్యోగాలు కల్పించామని.. ఉద్యోగులకు రెండు సార్లు పీఆర్‌సీ అమలు చేశామని.. ఆర్థిక సంక్షోభం కారణంగా జీతం సరిగా వేయలేకనే ఉద్యోగుల అసంతృప్తికి కారణమైందని తెలిపారు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ తాము వేస్తే.. 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. బీఆర్‌ఎస్ శ్రేణులు గట్టిగా పోరాడి లోక్‌సభ సీట్లలో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు.
ఇటీవల బీజేపీలో చేరిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మెన్ జనార్దన్‌రాథోడ్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నిర్మల్ జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మీ, నాయకులు జాన్సన్ నాయక్, రమాదేవీ, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమ్రెవార్, యూనిస్ అక్బానీ, అలాల్ అజరు పాల్గొన్నారు.