బీఆర్ఎస్ ను గెలిపిస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తా

-ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గాన్ని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, కిష్టంపేట గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతీ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కల్వల ప్రాజెక్టుకు పూర్తిగా మార్చి మినీ డ్యామ్ గా తీర్చిదిద్దుతానని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తోందని, మళ్లీ ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ మాత్రమే అవుతారని జోస్యం చెప్పారు. సంబండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండలంలోని బ్రాహ్మణపల్లి, ఘన్ముక్ల గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సారథ్యంలో బీఆర్ఎస్ లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్మానించారు. మృతురాలి కుటుంబానికి పరామర్శ మండలంలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన పూదరి లక్ష్మి మృతి చెందింది. కాగా ఆ కుటుంబాన్ని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ను లక్ష్మి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచులు జున్నూతులు సునితామల్లారెడ్డి, బండారి మత్తయ్య, బండ సుజాత కిషన్ రెడ్డి, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, నాయకులు మధూకర్ రెడ్డి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.