– వ్యవసాయం గురించి రాహుల్‌కు ఏం తెలుసు?
– గోదావరి వరదల కట్టడికి కరకట్ట కట్టి తీరుతాం..
– ఆరునూరైనా… గెలుపు తధ్యం : ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-బూర్గంపాడు/నర్సంపేట
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తే ఆగమాగమేనని, అందుకే ఓటు అలవోకగా వేయొద్దని, మీరు వేసే ఓటు ఐదేండ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తమని కాంగ్రెస్ అంటుందని, ధరణిని వేస్తారా? రైతులను వేస్తారా? అసలు మీ పాలసీ ఏంది? అంటూ ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి సమాధానం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరదల ముంపు నివారణకు కరకట్టను కట్టితీరుతామని హామీ ఇచ్చారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, పినపాక, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. వ్యవసాయం గురించి రాహుల్ గాంధీకి ఏం తెలుసని, గోల్‌మాల్ మాటలతో కాంగ్రెస్ నాయకులు.. మిమ్మల్ని బురిడీ కొట్టించాలని చూస్తున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. రాహుల్ గాంధీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. ధరణిని తీసి బంగాళా ఖాతంలో వేస్తామని బహటంగానే ప్రకటిస్తున్నారని, ధరణిని రద్దు చేస్తే దళారుల, పైరవీదారుల, లంచాల రాజ్యం వస్తుందని, ప్రజలందరూ ఏది కావాలో తేల్చుకోవాలని సూచించారు. రైతుల కష్టాలు తెలిసిన తాను రాష్ట్రంలో 24 గంటల పాటు కరెంటు ఇస్తుంటే.. కాంగ్రెస్ వాళ్ళు ఐదు గంటలు చాలు.. మూడు గంటలు చాలు.. అంటూ మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శమన్నారు. అవగాహన లేని కాంగ్రెస్ వల్ల ఈ రాష్ట్రానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని, కాంగ్రెస్ అధికారం కోసం తహతహలాడుతుందని, కాంగ్రెస్ వస్తే ప్రజా క్షేమాన్ని విస్మరిస్తారని ఆరోపించారు. గోదావరి వరదల వల్ల మన్య ప్రాంతం అతలాకుతలమవుతుందని., దీనిపై కరకట్ట నిర్మాణానికి రూ.2500 కోట్లతో ప్రతిపాదన తయారు చేశామని, అధ్యయనం జరుగుతుందని, మళ్లీ ఎన్నికల్లో గెలిచి కరకట్ట నిర్మాణాన్ని చేపడతామని, తానే స్వయంగా శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. పినపాక నియోజవర్గంలో రేగా కాంతారావును, భద్రాచలంలో తెల్లం వెంకటరావు, అశ్వారావుపేటలో మెచ్చా వెంకటేశ్వరరావును గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపెడతానని తెలిపారు. సభల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, పినపాక నియోజకవర్గం అసెంబ్లీ ఇన్‌చార్జి కోనేరు సత్యనారాయణ, దిండిగల రాజేందర్, జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఆరునూరైనా… గెలుపు తధ్యం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజలు మా వైపే ఉన్నారని, ఆరునూరైనా గెలుపు తధ్యమని.. కిందటి సారి కన్నా ఎక్కువ సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దామని, ఏటా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగలిగామని తెలిపారు. తలసరి ఆదాయ సాధనలో నెంబర్ వన్‌గా నిలబెట్టామన్నారు. గులాబీ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.. తద్వారా ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడం కోసమని, ఈ పదేండ్లలో కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించుకున్నామని తెలిపారు. ఇంటింటా తాగు నీటిని సరఫరా చేస్తున్నామని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించామన్నారు. జిల్లాకు ఆనుకొని రెండు నదులున్నా గత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మంచినీళ్లు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ధరణి లేకపోతే రైతు బంధు, రైతు బీమా, బ్యాంకుల్లో అప్పు ఎట్లొస్తది అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కరెంట్ లేదని, ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఏ పార్టీ ఏంటో.. దాని వైఖరేంటో తెల్సుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి చిత్తశుద్ది ఏంటో పరిశీలించి ఓటు వేయాలని సూచించారు. అభివృద్ధిపై ఊర్లల్లో.. బస్తీల్లో చర్చ పెట్టాలని, నిజనిజాలపై నిగ్గు తేల్చాలని, అప్పుడే పరిణితి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడుతూ ప్రజలు గెలుస్తారని తెలిపారు. మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, బీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, వీ.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.