కాంగ్రెస్‌ వస్తే.. ఆరు నెలలకో సీఎం ఖాయం

If Congress comes, the CM will be confirmed for six months– కేసీఆర్‌ను ఓడించడానికి ఇతర రాష్ట్రాల నుంచి గంగిరెద్దుల్లా వస్తున్నారు
– కోమటి బ్రదర్స్‌కు డబ్బు పిచ్చి పట్టింది : మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
– చిట్యాలలో రోడ్‌షో
నవతెలంగాణ- చిట్యాల టౌన్‌
కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల పథకం ఆరునెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మారే పథకమే తప్ప మరేమీ కాదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపును కాంక్షిస్తూ చిట్యాల పట్టణ కేంద్రంలోని పాలసెంటర్‌ నుంచి కనకదుర్గమ్మ సెంటర్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహిం చిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటే నకిరేకల్‌ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పరిపాలనలో నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేయలేదని, అలాంటి పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్‌ మూడవ సారి ముఖ్యమంత్రి అయితే ప్రతి తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వ్యక్తికి కేసీఆర్‌ బీమా వర్తింపజేస్తామని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణలోనే నల్గొండ జిల్లా అత్యధికంగా వరి పండించే జిల్లాగా అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికీ వివాహం జరిగేంత వరకు నెలకు రూ.3వేల భృతి ఇస్తామని, తెల్ల రేషన్‌ కార్డు ఉన్నోళ్లందరికీ రూ.400 గ్యాస్‌ సిలిండర్‌, రైతుబంధు ఎకరానికి రూ.10వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామని చెప్పారు. నకిరేకల్‌ నియోజక వర్గంలో 42,862 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, 10,450 మందికి కల్యాణలక్ష్మి ఇచ్చామని, రైతు వేదిక, శ్మశానవాటికలు, నకిరేకల్‌ పట్టణంలో రూ.32 కోట్లతో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో చిట్యాల పట్టణంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి, పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. వెలిమినేడ్‌ ప్రాంతంలో ఇండిస్టియల్‌ పార్కును ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు డబ్బు పిచ్చి పట్టిందని అన్నారు. ఒక్క కేసీఆర్‌ను ఓడించడానికి దేశంలోని ప్రధానమంత్రి మోడీ, అమిత్‌ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, డీకే శివకుమార్‌ లాంటి నాయకులు సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల్లా వస్తున్నారని, ఇలాంటివారిని తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ సహకారంతో చిట్యాల పట్టణంలో రూ.39 కోట్లతో అభివృద్ధి పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను పూర్తి చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ బండ నరేందర్‌ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌ చైర్మెన్‌్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, గుత్తా వెంకట్‌ రెడ్డి మెమోరియల్‌ చైర్మెన్‌్‌ గుత్తా అమిత్‌ రెడ్డి, చిట్యాల మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ జడల ఆది మల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.