
– కేటీఆర్ మహాధర్నా కు పార్టీ శ్రేణులు తరలిరావాలి
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 100 సీట్లకు పైగా కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందన్నారు. లగచర్ల ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చడని, ఆయన గిరిజన ద్రోహి అని విమర్శించారు. గిరిజనులను జైలుకు పంపి వారి భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అక్రమంగా రైతులపై మా నాయకుల పై పెట్టిన కేసులను ఎత్తివేసేంత వరకు మా పోరాటం ఆగదన్నారు. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల సొమ్మును దొచుకుంటున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని అన్నారు. ఏడాది కావస్తున్న రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగిన పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటుందన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, వారిని అన్ని విధాల కాపాడుకుంటానని భరోసా కల్పించారు. నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే గిరిజన మహాధర్నా కు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, గాంధీ నాయక్, రాజేందర్, పటేల్ నాయక్, హరీష్, వెంకన్న, ఎండీ షర్ఫీద్దీన్, గంగాధర్, కృష్ణమూర్తి, చిలుక బిక్షపతి, సమ్మయ్య, రఘు, వేణు, అనుదీప్, హేమాని, బాలు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.