అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తా

– బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి
– నియోజకవర్గంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్
  అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తానని కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ ఆమనగల్ మండలాలతో పాటు ఆయా గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనను ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని వేడుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా అలుపెరుగని పోరాటాలు చేసిన తనను ఒకసారి ఆశీర్వదించాలని ఓటర్లను ప్రాధేయ పడ్డారు. గతంలో రెండుసార్లు ఆతి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన తనను ప్రస్తుత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆచారి ఓటర్లను వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన స్థానిక నాయకులతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, బీజేపీ తాలూకా కోకన్వినర్ గోరటి నర్సింహ, కేకే శ్రీను ముదిరాజ్, లక్ష్మణ్ రావు, శ్రీకాంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.